రామడుగులో విషాదఛాయలు

19 Sep, 2019 10:39 IST|Sakshi
తరుణ్‌రెడ్డి(ఫైల్‌); నివాసంలో ఉంచిన తరుణ్‌రెడ్డి మృతదేహం

తరుణ్‌రెడ్డి మృతదేహం తీసుకురావడంతో కన్నీటి సంద్రంగా గ్రామం

అశ్రునయనాల నడుమ పూర్తయిన అంత్యక్రియలు

బాధిత కుటుంబానికి పలువురు నేతల పరామర్శ

నాలుగు రోజులైనా లభ్యం కాని సురభి రవీందర్‌ ఆచూకీ

సాక్షి, హాలియా: రామడుగు గ్రామం ఒక్కసారిగా కన్నీటిసంద్రంలో మునిగిపోయింది. గోదావరి లాంచీ ప్రమాదంలో గ్రామానికి చెందిన పాశం తరుణ్‌రెడ్డి గల్లంతయ్యారనే వార్త తెలిసినప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన మొదలై కంటిమీద కునుకులేకుండా పోయింది. తమ కుమారుడి ఆచూకీ లభించి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని ఆశపడ్డ కుటుంబ సభ్యులకు పాశం తరుణ్‌రెడ్డి(27) విగతజీవిగా మారి గ్రామానికి రావడంతో ఒక్కసారిగా రామడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుచ్చులూరు సమీపంలో గోదావరి నదిఒడ్డుకు చేరిన తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని గమనించిన ఎన్‌డీఆర్‌ఎఫ్, రెస్క్యూ బృందాలు మృతదేహాన్ని వెలికితీశాయి.

మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఏపీ ప్రభుత్వం వారి బంధువులకు తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని అప్పగించింది. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని తీసుకుని మంగళవారం రాత్రి 12 గంటలకు గ్రామానికి తీసుకురావడంతో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. విగతజీవిగా మారిన తరుణ్‌రెడ్డిని చూసి రామడుగు వాసులు ఘోల్లుమన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన చిన్నకుమారుడు తరుణ్‌రెడ్డి ఇక తిరిగిరానిలోకానికి వెళ్లాడని తల్లిదండ్రులు గుం డెలవిసెలా రోదించారు. మృతదేహాన్ని పూర్తిగా వస్త్రంలో చుట్టి తీసుకురావడంతో వారు చూసి తట్టుకోలేక పోయారు. తరుణ్‌రెడ్డి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. బుధవారం ఉదయం రామడుగులో కుటుంబ సభ్యులు తరుణ్‌రెడ్డికి అశ్రనయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. తరుణ్‌రెడ్డి కడసారి చూపుకోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సమీప గ్రామాల ప్రజలు తరలివచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలతో రామడుగు శోకసంద్రంగా మారిపోయింది.

నాలుగు రోజులైనా లభించని సురభి రవీందర్‌ ఆచూకీ..
పాపికొండల పర్యటనకు వెళ్లి లాంచీ ప్రమాదంలో గోదావరిలో గల్లంతయిన హాలియా పట్టణానికి చెందిన సురబి రవీందర్‌ ఆచూకీ లభించలేదు. నాలుగు రోజులు గడిచినా రవీం దర్‌ ఆచూకీ తెలియకపోవడంతో.. అతని జాడ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు కచ్చలూరులోనే ఉన్నారు. కుమారుడి ఆచూకీ దొరకకపోవడంతో హాలియాలో వారి తల్లితండ్రులు సురభి వెంకటేశ్వర్లు, లక్ష్మి ఆందోళన చెందుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కుమారుడి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు.   

పలువురు నేతల పరామర్శ..
రామడుగు గ్రామానికి తరుణ్‌రెడ్డి మృతదేహం తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న పలువురు నాయకులు గ్రామానికి చేరుకుని తరుణ్‌రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. పరామర్శించిన వారిలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ మజ్జిగపు వెంకట్రామ్‌రెడ్డి, నాయకులు అనంతరెడ్డి, సైదిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా