భారత క్రికెట్‌లో అరుదైన సందర్భం

8 Feb, 2018 14:34 IST|Sakshi
మంధన-విరాట్‌ కోహ్లి

కేప్‌టౌన్‌: భారత క్రికెట్‌లో అరుదైన  సందర్భం చోటు చేసుకుంది. అది క్రికెట్‌ అభిమానులకు మధుర జ్ఞాపకాల్ని తీసుకొచ్చింది. దక్షిణాఫ్రికాలో ఒకేరోజు భారత పురుషుల, మహిళల జట్లు అద్భుత ప్రదర్శన కనబర్చాయి. అసాధారణ ఆటతీరుతో సఫారీలను వారి గడ్డపై భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాయి. తొలుత మిథాలీరాజ్‌సేన రెండో వన్డేలో 178 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా అమ్మాయిలను మట్టికరిపించి 2-0తో సిరీస్‌ను ఖాతాలో వేసుకోగా, ఆపై విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత పురుషుల జట్టు కూడా సఫారీ జట్టును చిత్తు చేసి ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాలతో పాటు పురుషుల, మహిళల ప్రదర్శనల్లో పలు పోలికలు కనిపించాయి. ఈ రెండు జట్లు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేశాయి. ఇరు జట్లు దాదాపు సమంగా పరుగులు చేశాయి. భారత మహిళల జట్టు 302 పరుగులు చేస్తే, పురుషుల జట్టు 303 పరుగులు చేసింది. ఇరు జట్లు వంద పరుగులకుపైగా తేడాతో గెలుపొందాయి. ఇక్కడ పురుషుల జట్టు 124 పరుగుల తేడాతో గెలిచి దక్షిణాఫ్రికాలో ఆ జట్టుపై పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని సాధించగా, మహిళలు కూడా 178 పరుగుల తేడాతో విజయం సాధించి ఆ జట్టుపై అతి పెద్ద వన్డే గెలుపునే సొంతం చేసుకున్నారు. అదే క్రమంలో అటు స్మృతి మంధన శతక్కొడితే.. ఇటు విరాట్‌ కోహ్లి అజేయ సెంచరీతో విజృంభించాడు. వీరిద్దరి జెర్సీ నెంబర్లు 18 కావడం ఇక్కడ మరో విశేషం.

మరిన్ని వార్తలు