క్రికెట్ ఒక సినిమా అయితే..

10 Jul, 2016 15:33 IST|Sakshi
క్రికెట్ ఒక సినిమా అయితే..

న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్ చరిత్రలో పదివేల పరుగుల చేసిన తొలి క్రికెటర్, భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్పై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన క్రికెట్ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన గవాస్కర్ ఇప్పటికీ అత్యుత్తమ ఆటగాడేనని కొనియాడాడు. ఆదివారం గవాస్కర్ 66వ పుట్టినరోజు సందర్భంగా  వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించాడు. ప్రస్తుతం అన్ని సౌకర్యాలు ఉండి కూడా సాధించలేని ఘనతను గవాస్కర్ ఏనాడో అందుకోవడం నిజంగా అసాధారణ విషయమన్నాడు. క్రికెట్ ఒక సినిమా అయితే.. సునీల్ గవాస్కర్ 'షోలే' లాంటివాడంటూ సెహ్వాగ్ పొగడ్తలతో ముంచెత్తాడు.

'హెల్మెట్ లేకుండా క్రికెట్లో గవాస్కర్ తనదైన ముద్రను వేశాడు. ఇప్పుడు అన్ని ఉండి కూడా గవాస్కర్ సాధించిన ఘనతలను అందుకోవడం చాలా కష్టం. క్రికెట్ అనేది సినిమా అయితే.. గవాస్కర్ అనే వ్యక్త్తి కచ్చితంగా షోలే సినిమాలాంటివాడే. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాట్స్మన్ సన్నీ పాజీకి ఇవే నా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయువుతో గవాస్కర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి'అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.


టెస్టు క్రికెట్లో పదివేల పరుగులు సాధించిన మొదటి క్రికెటర్ గా ఘనత సాధించిన గవాస్కర్..  అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 30 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు.



 

మరిన్ని వార్తలు