కేటీఆర్, హరీశ్లపై భట్టివిక్రమార్క ఫైర్ | Sakshi
Sakshi News home page

కేటీఆర్, హరీశ్లపై భట్టివిక్రమార్క ఫైర్

Published Sun, Jul 10 2016 3:07 PM

కేటీఆర్, హరీశ్లపై భట్టివిక్రమార్క ఫైర్ - Sakshi

హైదరాబాద్: పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలుచేసిన డబ్బును ఎందుకు దుబారా చేస్తున్నారని ప్రశ్నించిన దిగ్విజయ్ సింగ్ ను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు విమర్శించడాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క తప్పుపట్టారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలను నీరుగార్చి, కొత్తగా ప్రకటించిన పథకాలకు నిధులు కేటాయించని టీఆర్ఎస్ మంత్రులు సంక్షేమం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆదివారం గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడిన భట్టి ప్రభుత్వ పథకాల్లోని లొసుగులను ఎకరువుపెట్టారు. (చదవండి: కేసీఆర్.. ఏమిటీ దుబారా?)

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించి, అమలుచేస్తున్నానని చెప్పుకొంటున్న అన్ని పథకాలూ అస్తవ్యస్తంగా మారాయి. 6 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని అంటున్నారు. అన్ని ఇళ్లు కట్టాలంటే కనీసం రూ. 46వేల కోట్లు అవసరం అవుతాయి. కానీ ఇప్పటివరకు ఆ పథకానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. మూడు ఎకరాల భూమి కోసం ఏడు లక్షల మంది దళిత కుటుంబాలు ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి. వాళ్లకు పంచేందుకు అవసరమైన 21 లక్షల ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. కాంగ్రెస్ అమలుచేసిన 'అమ్మ హస్తం' లాంటి పథకాలను ఎత్తేశారు. వాటి స్థానంలో కొత్త పథకాలు తేనేలేదు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతొ అంచనాలను భారీగా పెంచి రాష్ట్ర ఖజానా దుబారా చేస్తున్నారు' అని భట్టీ చెప్పుకొచ్చారు.గాంధీ కుటుంబంతో పోల్చుకునే అర్హత టీఆర్ఎస్ నేతలకు లేదని, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉన్నా, సోనియా, రాహుల్ గాంధీలు వాటిని తీసుకోలేదని భట్టీ గుర్తుచేశారు. దిగ్విజయ్ నిబద్ధతగల నాయకుడని, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను సహించలేకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారని, సమాధానాలు చెప్పేంతవరకు ప్రశ్నిస్తూనే ఉంటామని భట్టి అన్నారు. (చదవండి: 'ఆయన నుంచి నేర్చుకోవాల్సిన గతి పట్టలేదు')

ప్రభుత్వం తలపెట్టిన హరిత హారం కార్యక్రమాన్ని ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రశ్నంసించడంపై మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..'కార్యక్రమం బాగుందన్నంత మాత్రాన అందులో జరుగుతున్న అవినీతిని సమర్థించినట్లుకాదు'అని భట్టి పేర్కొన్నారు. హరితహారం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని భట్టి ఆరోపించడం, జానా మాత్రం ఆ కార్యక్రమాన్ని సమర్థించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement