-

‘పిచ్’ ముదిరింది!

30 Oct, 2015 23:45 IST|Sakshi
‘పిచ్’ ముదిరింది!

భారత క్రికెట్ జట్టు డెరైక్టర్ రవిశాస్త్రి, ముంబై క్యురేటర్ సుధీర్ నాయక్‌ల మధ్య గొడవ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దగ్గరకు చేరింది. అయితే ఇన్ని రోజులూ క్యురేటర్‌ను రవిశాస్త్రి దూషించాడంటూ వివాదం సాగుతుండగా... తాజాగా ఇది మరో మలుపు తిరిగింది. తాను  సుధీర్‌ను తిట్టలేదని రవిశాస్త్రి చెబుతుండగా... మూడు వారాల ముందే స్పిన్ ట్రాక్ కావాలని చెప్పినా క్యురేటర్ పట్టించుకోలేదని, జట్టు మాటను బేఖాతరు చేశాడని తాజాగా భారత జట్టు మేనేజ్‌మెంట్ ఫిర్యాదు చేసింది.

మొత్తానికి ఇది చిలికి చిలికి గాలివానలా మారి ముంబై క్రికెట్ సంఘం, బీసీసీఐ మధ్య వివాదంగా మారబోతోంది.

 
* బీసీసీఐ దగ్గరకి సుధీర్ నాయక్-రవిశాస్త్రి గొడవ
* క్యురేటర్‌కు మద్దతుగా ముంబై క్రికెట్ సంఘం
* జట్టు మాట వినలేదంటూ బోర్డు ఆగ్రహం
ముంబైలో జరిగిన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేసి పరుగుల వరద సృష్టించారు. కొత్త రికార్డులు నెలకొల్పి భారత్‌ను చిత్తు చేశారు. నిజానికి ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఉంటే మ్యాచ్ ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉండేది.

ముందు బ్యాటింగ్ చేసిన జట్టు పరుగుల పండగ చేసుకునే విధంగా పిచ్ ఉంది. దక్షిణాఫ్రికాలాంటి బలమైన జట్టుకు ఫ్లాట్ పిచ్ ఎలా ఇచ్చారనేది ఇప్పటికీ మిస్టరీయే. నిజానికి ఆ జట్టు బలహీనత స్పిన్. అందుకే ధోని ఏకంగా ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో సిరీస్ ఆడాడు. సాధారణంగా ఏ జట్టయినా సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు... తమ బలం, ప్రత్యర్థి బలహీనత ఆధారంగా పిచ్‌లను రూపొందిస్తుంది. భారత్ కూడా ఇదే పని చేయాలని భావించింది. సిరీస్ ఆరంభానికి ముందే ఐదు వన్డేల్లోనూ స్పిన్‌కు అనుకూలించే ట్రాక్‌లు ఉండాలని జట్టు కోరింది.

బీసీసీఐ పిచ్‌ల కమిటీ హెడ్ దల్జీత్ సింగ్‌తో భారత మేనేజ్‌మెంట్ మాట్లాడింది. ఐదు వన్డేలు జరిగే అసోసియేషన్ల క్యురేటర్లందరికీ దల్జీత్ సింగ్ ఈ సమాచారం పంపించారు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లే తయారు చేయాలని చెప్పారు. తొలి నాలుగు వన్డేలు నిర్వహించిన కాన్పూర్, ఇండోర్, రాజ్‌కోట్, చెన్నైల సంఘాల  క్యురేటర్లు ఈ ఆదేశాలను పాటించారు. కానీ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) క్యురేటర్లు మాత్రం దీనిని పట్టించుకోలేదు. పైగా బౌలర్లకు ఎలాంటి సహకారం లేని ఫ్లాట్ పిచ్‌ను రూపొందించారు.
 
మ్యాచ్‌కు ముందు రోజు మైదానానికి వచ్చిన భారత క్రికెటర్లు ఈ పిచ్‌ను చూసి షాక్ తిన్నారు. రవిశాస్త్రి ఆదేశం మేరకు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్... పిచ్ క్యురేటర్ రమేశ్ మమున్‌కర్‌ను కలిశారు. పిచ్‌పై కొంత భాగం అధికంగా వాటరింగ్ చేయాలని తద్వారా కాస్తయినా స్పిన్నర్లకు సహకారం దొరుకుతుందని కోరారు. కానీ రమేశ్ ఈ మాట పెడచెవిన పెట్టారు. అయినా భారత జట్టులో ఓ మూలన ఆశ ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తే సమస్య లేదని భావించారు. కానీ డివిలియర్స్ టాస్ గెలిచాడు. దక్షిణాఫ్రికా ఏకంగా 438 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు ముందే మ్యాచ్ ఓడిపోయామని గ్రహించింది. భారత బౌలర్లంతా చేష్టలుడిగి నిలుచుండిపోవడం చూసిన రవిశాస్త్రితో పాటు కోచ్‌లు తీవ్రంగా ఆగ్రహం చెందారు.
 
నిజంగా తిట్టలేదా?: దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగియగానే  జట్టు డెరైక్టర్ రవిశాస్త్రి... చీఫ్ క్యురేటర్ సుధీర్ నాయక్‌తో ‘మంచి పిచ్ తయారు చేశావ్’ అని చప్పట్లు కొడుతూ వెటకారంగా అన్నారు. దీనికి తాను థ్యాంక్స్ చెప్పానని, అయితే శాస్త్రి తనపై బూతులకు దిగాడని సుధీర్ ఆరోపించారు. అయితే జట్టు డెరైక్టర్ మాత్రం తాను ఆ సమయంలో ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉన్నానని, తాను తిట్టలేదని అంటున్నారు. దీనిపై సుధీర్ తొలుత ముంబై క్రికెట్ సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు.

రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ముంబై సంఘం సుధీర్‌కు మద్దతుగా నిలబడింది. దీంతో ఆయన బీసీసీఐకి కూడా రవిశాస్త్రి, అరుణ్‌లపై ఫిర్యాదు చేశారు. మాట ఎందుకు వినలేదు?: అయితే బీసీసీఐ పెద్దలు దీనిపై ఇప్పటికే రవిశాస్త్రితో మాట్లాడారు. అలాగే బీసీసీఐ పిచ్‌ల కమిటీ హెడ్ బల్జీత్ సింగ్‌నూ సంప్రదించారు. అన్ని సంఘాలకూ స్లో పిచ్‌లు తయారు చేయమని ఆదేశాలు పంపామని ఆయన కూడా చెప్పినట్లు సమాచారం.

దీంతో బీసీసీఐ సుధీర్ నాయక్‌తో పాటు ముంబై క్రికెట్ సంఘాన్ని వివరణ అడగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ముంబై సంఘం, బీసీసీఐ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. శ్రీనివాసన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉప్పు-నిప్పులా ఉండేవి. బోర్డులోకి శశాంక్ మనోహర్ వచ్చిన తర్వాత పరిస్థితి సర్దుకుందనే అభిప్రాయం ఏర్పడింది. కానీ ఈ వివాదంతో మరోసారి పంచాయితీ మొదలైంది.               -సాక్షి క్రీడావిభాగం
 

మరిన్ని వార్తలు