విలియమ్సన్ 'బెస్ట్' ఇన్నింగ్స్

3 Jun, 2017 07:30 IST|Sakshi
విలియమ్సన్ 'బెస్ట్' ఇన్నింగ్స్

బర్మింగ్హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-ఎలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ శతకం నమోదు చేశాడు. 96 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో విలియమ్సన్ సెంచరీ చేశాడు.  తద్వారా ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును విలియమ్సన్ సాధించడమే కాకుండా, ఆ జట్టుపై తొలి వన్డే శతకాన్ని నమోదు చేశాడు. అంతకుముందు ఆసీస్ పై విలియమ్సన్ అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు 81.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ఆరంభించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు గప్టిల్, ల్యూక్ రోంచీలు ఇన్నింగ్స్ ను ఎటువంటి తడబాటు లేకుండా ప్రారంభించారు. అయితే న్యూజిలాండ్ స్కోరు 40 పరుగుల వద్ద గప్టిల్(26) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. రోంచీకి జత కలిసిన విలియమ్సన్ స్కోరు బోర్డును చక్కదిద్దాడు.అయితే ఇన్నింగ్స్ పదో ఓవర్ లో వర్షం రావడంతో మ్యాచ్ ను 46 ఓవర్లకు కుదించారు.

మ్యాచ్ ముగిసిన తరువాత తిరిగి క్రీజ్ లోకి వచ్చిన రోంచీ-విలియమ్సన్ లు 70 పరుగులు జోడించి స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కాగా, రోంచీ (65) రెండో వికెట్ గా అవుట్ కావడంతో కివీస్ కాస్త తడబడినట్లు కనిపించింది. అయితే ఆపై రాస్ టేలర్-విలియమ్సన్ల జోడి కుదురుగా బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లడంతో న్యూజిలాండ్ తిరిగి గాడిలో పడింది.  ఈ జోడి 99 పరుగులు జత చేసిన తరువాత టేలర్(46) మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత కాసేపటికి విలియమ్సన్ సెంచరీతో మెరిశాడు. కాగా, శతకం సాధించిన వెంటనే విలియమ్సన్ అనవసర పరుగు కోసం యత్నించి నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరాడు.

మరిన్ని వార్తలు