కోస్టారికా టాప్

25 Jun, 2014 01:03 IST|Sakshi
కోస్టారికా టాప్

బెలో హారిజోంట్: ప్రస్తుత ప్రపంచకప్‌లో సంచలన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న కోస్టారికా అదే రీతిన ఆడుతూ గ్రూప్ డిలో అగ్రస్థానం దక్కించుకుంది. మంగళవారం రాత్రి ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గోల్స్ నమోదు కాకపోవడంతో 0-0తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో కోస్టారికా మొత్తం ఏడు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నాకౌట్‌కు వెళ్లనుంది. దీంతో గ్రూప్ సిలో రెండో స్థానం పొందిన జట్టుతో ప్రిక్వార్టర్స్ ఆడనుంది.
 
 గ్రూపులో టాప్ స్థానం దక్కించుకోవాలని కోస్టారికా.. కనీసం ఓ విజయమైనా సాధించాలనే లక్ష్యంతో ఇంగ్లండ్ జట్టు ప్రథమార్ధంలో హోరాహోరీ ఆటను ప్రదర్శించాయి.  12వ నిమిషంలో ఇంగ్లండ్‌కు గోల్ చేసే అవకాశం లభించింది. జేమ్స్ మిల్నర్ నుంచి షార్ట్ పాస్‌ను తీసుకున్న స్ట్రయికర్ డానియల్ స్టరిడ్జ్ 23 గజాల నుంచి బంతిని తన్నగా అది గోల్ పోస్టు ఎడమవైపు బార్‌ను తాకుతూ పక్కకు వెళ్లింది.  35వ  నిమిషంలోనూ స్టరిడ్జ్ కొట్టిన షాట్ గోల్ పోస్టు బార్‌పైనుంచి వెళ్లింది.  ద్వితీయార్ధంలో 49వ నిమిషంలోనూ ల్యూక్ షా ఇచ్చిన పాస్‌ను స్టరిడ్జ్ వృథా చేశాడు. 76వ నిమిషంలో వేన్ రూనీ సబ్‌స్టిట్యూట్‌గా అడుగుపెట్టినా ఫలితం లేకపోయింది.  కోస్టారికా గోల్‌కీపర్ నవాస్ ఇంగ్లండ్ ప్రయత్నాలను సమర్ధంగా అడ్డుకున్నాడు.


 

మరిన్ని వార్తలు