ఎడారిలో... ప్రాణాలు గుప్పెట్లో..!

25 Jun, 2014 01:08 IST|Sakshi
ఎడారిలో... ప్రాణాలు గుప్పెట్లో..!

ఇరాక్‌లో చిక్కుకున్న 15 మంది జిల్లావాసులు
వివరాలు సేకరిస్తున్ అధికారులు
బాధిత కుటుంబాల్లో ఆందోళన
తమవారిని క్షేమంగా రప్పించాలని వేడుకోలు
 

విదేశంలో ఉద్యోగం వచ్చిందంటూ సంబరపడ్డారు. లక్షలకు లక్షలు ఏజెంట్ చేతిలో పోసి భవిష్యత్తుపై కోటి ఆశలతో ఇరాక్ విమానం ఎక్కారు. కొన్నాళ్లు అక్కడ జీవితం సాఫీగానే సాగింది. ఇంతలో ఇరాక్‌లో అలజడి మొదలైంది. అంతర్యుద్ధం పరిస్థితిని తారుమరుచేసింది. బాంబుల మోతతో గుండెలు దద్దరిల్లాయి. చేయడానికి ఉద్యోగం లేదు... జీతం ఇవ్వడం లేదు...తినడానికి తిండి లేదు.... స్వస్థలాలకు వెళతామంటే పంపించే దిక్కు లేదు....ఇలా 15 మంది విశాఖ జిల్లావాసులు ఇరాక్‌లో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు.     

విశాఖ రూరల్ : ‘‘రోజురోజుకు యుద్ధ ట్యాం కర్లు ముందుకు చొచ్చుకొస్తున్నాయి. బాంబుల మోతతో భూ ప్రకంపనలు స్పష్టంగా తెలుస్తున్నాయి. కేవలం 60 కిలోమీటర్ల దూరంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి...’ అంటూ బాధితులు వారి కుటుంబ సభ్యులకు సమాచారమందించడంతో అందరిలోను కలవరం మొదలైంది. తమవారిని జిల్లాకు రప్పించే ఏర్పాట్లు చేయాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇరాక్‌లో 15 మంది జిల్లావాసులు

వివిధ రంగాల్లో ఉద్యోగాల కోసం 15 మంది విశాఖ వాసులు ఇరాక్‌కు వెళ్లి చిక్కుకుపోయారు. వారి పూర్తి వివరాలను పంపించాలంటూ ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. జిల్లా నుంచి ఇరాక్‌కు వెళ్లిన వారి వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తహశీల్దార్లను ఆదేశించారు. దీంతో మంగళవారం నాటికి జాబితాను సిద్ధం చేశారు. దీని ప్రకారం 15 మంది జిల్లా వాసులు ఇరాక్‌లో ఉన్నట్టు తేల్చారు. అత్యధికంగా యలమంచిలి మండలం నుంచే 9 మంది, కశింకోట నుంచి ఒకరు, విశాఖ నగరం నుంచి ఐదుగురు ఇరాక్‌లో ఇబ్బందులు పడుతున్నారు. యలమంచిలి మండలంలో ఏటికొప్పాక గ్రామానికి చెందిన సేనాపతి నానాజీ, సేనాపతి నాగేశ్వరరావు, సేనాపతి శ్రీను, బగుడు గోవింద, సేశెట్టి ప్రసాద్, సాకిరెడ్డి శంకర్, అదే మండలంలో తుంగరపాలెం గ్రామం నుంచి దొడ్డాపు రమణ, చింతా చంద్రకాంత్, రాయ్ రాజేష్, కశింకోట మండలానికి చెందిన నూకరాజు ఇరాక్‌లో చిక్కుకున్నారు. అలాగే విశాఖ నగరానికి చెందిన దాడి శ్రీనివాసరావు (అక్కయ్యపాలెం), గండ్రెడ్డి నాగేంద్ర(సింథియా), అప్పల నరసింహమూర్తి(సాగర్‌నగర్), కె.ఈశ్వరరావు(పెదగంట్యాడ), గొటివాడ ఈశ్వరరావు(అక్కిరెడ్డిపాలెం)లు ఇరాక్‌లో అవస్థలు పడుతున్నారు.

కుటుంబాలకు ధైర్యం చెప్పిన కలెక్టర్

ఇరాక్‌లో చిక్కుకున్న వారి వివరాలను సేకరించిన వెంటనే జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ వారి కు టుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాక్‌లో తమ వారి పరిస్థితులపై ఆరా తీశారు. అక్కడ నుంచి వారిని సురక్షితంగా జిల్లాకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వంతో మాట్లాడతామని ధైర్యం చెప్పారు.

టోల్‌ఫ్రీ నంబర్లు

జిల్లా నుంచి ఇరాక్‌కు వెళ్లిన వారి పేరు, పాస్‌పోర్ట్ నంబర్, అక్కడ ఉండే స్థలం, పనిచేసే కంపెనీ, ఫోన్ నంబర్ తదితర వివరాలు సేకరించి ప్రభుత్వానికి సమర్పిస్తే కేంద్ర విదేశీ, వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఇండియన్ మిషన్ ఇన్ బాగ్దాద్ వారికి సహాయకారులుగా ఉంటారని కలెక్టర్ సూచించారు. సదరు అంశాలకు సంబంధించిన వివరాలను తెలి యజేసేందుకు, సేకరించేందుకు ఇండియన్ మిషన్ ఇన్ బాగ్దాద్ సహాయం కోసం 00964770 4444899, 009647704843247, 00964770 4447899, 009647704843247కు సంప్రదించాలని కోరారు. అలాగే ఇతర సహాయం కోసం హైదరాబాద్‌లో ఉన్న సెక్రటేరియల్ ఎన్‌ఆర్‌ఐ సెల్‌లో 040-23454946, 9949054467 నంబర్లు, టౌటజీః్చఞ. జౌఠి.జీ, ౌటఛీఞటౌౌ్టఃజఝ్చజీ.ఛిౌఝ ఇ-మెయిల్ అడ్రస్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నంబర్లకు ఫోన్ చేసి ఇరాక్‌లో ఉన్న వారి క్షేమ సమాచారం, ఇతర వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. అలాగే జిల్లా కలెక్టరేట్‌లో కూడా టోల్ ఫ్రీ నంబర్ 1800-4250-0002కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.
 
తిండీతిప్పలూ లేవు.
.
వీరికి ఉద్యోగం లేకపోగా తినడానికి తిండి కూడా పెట్టడం లేదని బాధితులు కుటుంబ సభ్యులకు ఫోన్లలో చెప్పుకుంటూ రోధిస్తున్నారు. సిరియాలో యుద్ధం ప్రారంభమైనప్పుడే స్వస్థలాలకు వెళ్లిపోతామని చెప్పినప్పటికీ కంపెనీ యాజమాన్యాలు పంపించలేదని, ప్రస్తుతం కొంత మందికి 200 కిలోమీటర్లలో, మరికొంత మందికి కేవలం 60 కిలోమీటర్లు దూరంలో యుద్ధం జరుగుతున్నట్లు బాధితులు ఫోన్లలో చెబుతున్నారు. యుద్ధం సమీపిస్తే పంపిస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారని వారు ఆందోళన చెందుతున్నారు. వారి పరిస్థితులు తెలుసుకున్న ఇక్కడున్న కుటుంబ సభ్యులు వెంటనే తమ వారిని వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని వేడుకుంటున్నారు.
 
 

>
మరిన్ని వార్తలు