'ఆ క్రికెటర్ కుటుంబానికి అండగా ఉంటాం'

21 Apr, 2015 13:25 IST|Sakshi
'ఆ క్రికెటర్ కుటుంబానికి అండగా ఉంటాం'

కోల్ కతా: బెంగాల్ డివిజన్ నాకౌట్ క్రికెట్ మ్యాచ్ లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన యువ క్రికెటర్ అంకిత్ కేసరీ కుటుంబానికి అండగా ఉంటామని కోల్ కతా నైట్ రైడర్స్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. అంకిత్ కేసరీ మృతితో ఒక్కసారి షాక్ కు గురైనట్లు గంభీర్ తెలిపాడు. ' ఆ యువ క్రికెటర్ మనతో లేడు. ఆ ఘటన అందర్నీ విషాదంలో నింపింది.ఆ కుటుంబం ఏమైతే పొగొట్టుకుందో అది తిరిగి సంపాదించేది కాదు. కానీ ఒక్క విషయం కచ్చితంగా చెప్పగలను. మనం ఆ కుటుంబానికి ఏమైతే చేయగలమో ఆ సాయం చేద్దాం'అని గంభీర్ తెలిపాడు.

బెంగాల్ డివిజన్ 1 నాకౌట్ పోటీల్లో భాగంగా ఈ నెల 17న ఈస్ట్ బెంగాల్, భవానీపూర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అర్నబ్ నంది స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన అంకిత్.. డీప్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ బంతిని గాల్లోకి లేపాడు. అంకిత్‌తో పాటు ఆ బంతిని అందుకునేందుకు బౌలర్ సౌరవ్ మొండల్ కూడా పరుగెత్తుకొచ్చాడు. ఒకరిని గుర్తించని మరొకరు ఒక్కసారిగా ఢీకొనడంతో అంకిత్ కుప్పకూలాడు. అంకిత్ కు తీవ్రగాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినా మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అంకిత్ ఆదివారం తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.
 

మరిన్ని వార్తలు