పదిహేడేళ్ల రాజసం...

14 Jun, 2017 00:57 IST|Sakshi
పదిహేడేళ్ల రాజసం...

300 క్లబ్‌లో భారత ఆటగాళ్లు...

సచిన్‌ – 463 వన్డేలు
(18,426 పరుగులు)
ద్రవిడ్‌ – 340 (10,768)
అజహరుద్దీన్‌ – 334 (9,378)
గంగూలీ – 308 (11,221)


300వ వన్డే ఆడనున్న యువరాజ్‌ సింగ్‌
భారత్‌ చిరస్మరణీయ విజయాల్లో కీలకపాత్ర


‘యువరాజ్‌ సింగ్‌ తొలి మ్యాచ్‌లో అతని దెబ్బకు తలవంచిన జట్టులో నేనూ ఉన్నాను. అదో అద్భుతమైన ఇన్నింగ్స్‌. ఇన్నేళ్ల తర్వాత కూడా అతని బ్యాటింగ్‌లో అదే చమక్కు కనిపిస్తోంది’... పది రోజుల క్రితం పాకిస్తాన్‌పై యువరాజ్‌ సింగ్‌ చెలరేగిపోతున్నప్పుడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ చేసిన వ్యాఖ్య ఇది. 2000 ఐసీసీ నాకౌట్‌ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆ క్వార్టర్‌ ఫైనల్లో 80 బంతుల్లోనే 84 పరుగులు చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన యువీ, అంతర్జాతీయ క్రికెట్‌పై తన రాకను ఘనంగా చాటాడు.

ఒకటా, రెండా... ఈ సుదీర్ఘ ప్రస్థానంలో యువరాజ్‌ సింగ్‌ ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్‌లు ఎన్నో. కొలంబో, లార్డ్స్, సెంచూరియన్, ఢాకా, సిడ్నీ, చెన్నై... ఇలా వేదికలు మారినా యువరాజ్‌ తన ఆటతో భారత్‌ను గెలిపిస్తూ, అభిమానుల మనసు దోచుకుంటూ పోయాడు. మధ్యలో చిన్న చిన్న విరామాలు వచ్చినా ఆగకుండా సాగిపోయిన ఈ పంజాబీ పుత్తర్‌ మరో మైలురాయిని చేరుకుంటున్నాడు. భారత అత్యుత్తమ వన్డే ఆటగాళ్లలో ఒకడైన యువరాజ్‌ గురువారం చాంపియన్స్‌ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగే సెమీఫైనల్‌ మ్యాచ్‌తో 300 వన్డేలు పూర్తి చేసుకోనుండటం విశేషం.    

సాక్షి క్రీడా విభాగం : పదిహేడు సంవత్సరాల క్రితం యువరాజ్‌ సింగ్‌ వన్డేల్లోకి అడుగు పెట్టినప్పుడు కొత్త మిలీనియానికి ప్రతినిధిగా కనిపించాడు. బ్యాటింగ్‌లో ధాటి, మాటల్లో దూకుడు, మైదానం బయట అల్లరి కుర్రాడి తరహా ముద్ర... అతని ఆటపై అందరికీ నమ్మకమున్నా, ఇతర అంశాలు యువరాజ్‌ కెరీర్‌ను ముందుకు సాగనీయకపోవచ్చని చాలా మంది అంచనా వేశారు. అయితే ఆ సమయంలో 18 ఏళ్ల అబ్బాయి ఎలా ఉండాలో తానూ అలాగే ఉన్నానంటూ చెప్పుకున్న అతను... కేవలం తన శ్రమ, పట్టుదల, పోరాటతత్వంతో అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో కొద్ది మందికి మాత్రమే సాధ్యమైన  అరుదైన ఘనతలను యువీ తన పేరిట లిఖించుకున్నాడు.

పడ్డ ప్రతీసారి...
యువరాజ్‌ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. అయితే ఏనాడూ నిరాశ చెందని అతను మళ్లీ పట్టుదలగా పోరాడి జట్టులోకి తిరిగొచ్చాడు. దశాబ్దంపాటు భారత వన్డే జట్టులో అంతర్భాగంగా మారిన తర్వాత వరుస వైఫల్యాలతో 2010లో తొలిసారి అతనిపై వేటు పడింది. కానీ తీవ్రంగా శ్రమించి అదే ఏడాది చివర్లో జట్టులోకి వచ్చిన యువీ కొద్ది రోజులకే ప్రపంచకప్‌లో అదరగొట్టాడు. 2013లో ఫామ్‌ కోల్పోవడం, ఫిట్‌నెస్‌ లేకపోవడంతో మళ్లీ చోటు పోయింది. కేవలం ‘జాలి’తో అవకాశాలు ఇస్తున్నారని కూడా విమర్శలు వచ్చాయి. అయితే ఫ్రాన్స్‌లో ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌పై దృష్టి పెట్టి మళ్లీ చాకులా మారి జట్టులోకి దూసుకొచ్చాడు. అదే ఏడాది దక్షిణాఫ్రికాతో సిరీస్‌ తర్వాత మరోసారి స్థానం కోల్పోయాడు. ఇక రిటైర్మెంటే మిగిలింది అనుకుంటున్న తరుణంలో దేశవాళీ క్రికెట్‌లో చెలరేగి మూడేళ్ల బ్రేక్‌ తర్వాత జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవడం యువీ పోరాటతత్వాన్ని చూపిస్తోంది.

కెరీర్‌ శిఖరాన...
యువరాజ్‌ వన్డే కెరీర్‌లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. ఎన్నో మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కు ఫుల్‌ వినోదాన్ని పంచాయి. కానీ ‘ఈ విజయం నాది’ అని అతను గర్వంగా చెప్పుకోగలిగే ప్రదర్శన మాత్రం 2011 వన్డే వరల్డ్‌ కప్‌లోనే. 28 ఏళ్ల తర్వాత భారత్‌ మళ్లీ ప్రపంచకప్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర యువీదే. నాలుగు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’... ఇలా అన్నింటా యువీనే కనిపించాడు. బ్యాటింగ్‌లో 362 పరుగులు, బౌలింగ్‌లో 15 వికెట్లతో అతను దుమ్మురేపాడు.  

క్యాన్సర్‌తో పోరాడి...
ప్రపంచకప్‌లో భారత్‌ విజయాల బాటలో ఉన్న సమయంలోనే తనకు క్యాన్సర్‌ వచ్చిందనే సంగతి యువరాజ్‌కు తెలుసు. కానీ తాను చనిపోయినా సరే, టోర్నీ మధ్యలో మాత్రం వెళ్లిపోనని అతను గట్టిగా చెప్పుకున్నాడు. చెన్నైలో వెస్టిండీస్‌తో సెంచరీ చేసిన మ్యాచ్‌లో రెండు, మూడు సార్లు అతను గ్రౌండ్‌లోనే వాంతి చేసుకున్నాడు. అయితే రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగేందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత చికిత్స అనంతరం క్యాన్సర్‌ నుంచి కోలుకొని మళ్లీ క్రికెట్‌ ఆడాలని భావించడమే పెద్ద సాహసం. కానీ అన్ని అవరోధాలను అధిగమించి యువీ భారత జట్టులోకి పునరాగమనం చేయడం పెద్ద విశేషం.

ఆణిముత్యాలు...
80 బంతుల్లో 84 (2000, నైరోబీ): ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో యువీ 12 ఫోర్లతో చెలరేగాడు. సీనియర్లంతా విఫలమైన చోట యువీ మెరుపులతో భారత్‌ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

110 బంతుల్లో 98 (2001, కొలంబో):  శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు సెహ్వాగ్, గంగూలీ డకౌట్‌ కాగా... ద్రవిడ్‌ (47) సహకారంతో యువరాజ్‌ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 46 పరుగులతో గెలిచింది.

63 బంతుల్లో 69 (2002, లార్డ్స్‌): భారత క్రికెట్‌ రాతను మార్చిన మ్యాచ్‌ ఇది. 300కు పైగా పరుగులు ఛేదించడం అంటే అద్భుతంగా భావించే ఆ రోజుల్లో యువరాజ్, కైఫ్‌ (87 నాటౌట్‌) భాగస్వామ్యం భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. వీరిద్దరు 121 పరుగులు జోడించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు. 326 పరుగుల ఛేదన అనంతరం లార్డ్స్‌ బాల్కనీలో కెప్టెన్‌ గంగూలీ సంబరాలు అందరికీ గుర్తుండిపోయాయి.

53 బంతుల్లో 50 నాటౌట్‌ (2003, సెంచూరియన్‌): పాకిస్తాన్‌తో జరిగిన ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌ అందరికీ సచిన్‌ (98) వల్లే గుర్తుండిపోయింది కానీ మ్యాచ్‌ను ముగించడంలో యువీ కూడా ముఖ్య భూమిక పోషించాడు.

85 బంతుల్లో 102 నాటౌట్‌ (2003, ఢాకా): యువరాజ్‌ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. 71వ వన్డేలో గానీ ఇది రాలేదు. భారత్‌ 200 పరుగులతో బంగ్లాను చిత్తు చేసింది.

299 వన్డేల్లో యువరాజ్‌ 36.84 సగటుతో 8,622 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 52 అర్ధసెంచరీలు ఉన్నాయి. 38.45 సగటుతో 111 వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌లో 155 సిక్సర్లతో ఈ జాబితాలో పదో స్థానంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు