ట్రయల్ రన్‌కు ‘మెట్రో’ రెడీ

25 Oct, 2013 03:44 IST|Sakshi
సాక్షి, చెన్నై: నగరంలో ట్రయల్ రన్‌కు మెట్రో రైలు సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో ప్రయోగాత్మకంగా రైలును నడపనున్నారు. బ్రెజిల్ నుంచి వచ్చిన ఇంజిన్‌తో కూడిన నాలుగు బోగీలతో కూడిన రైలును పట్టాలు ఎక్కించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును రూ.15 వేల కోట్లతో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తిరువొత్తియూరు విమ్కో నగర్ నుంచి జెమిని, సైదాపేట, గిండి మీదుగా మీనంబాక్కం వరకు 32.1 కిలోమీటర్లు ఒక మార్గం, సెంట్రల్ నుంచి కోయంబేడు మీదుగా సెయింట్ థామస్ మౌంట్ వరకు 22 కిలోమీటర్లు మరో మార్గంలో ఈ రైలు నడపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెంట్రల్  - కోయంబేడు - సెయింట్ థామస్ మౌంట్ మార్గంలో వంతెనల నిర్మాణం పూర్తయింది. ట్రాక్ ఏర్పాటు పనులు వేగవంతం చేశారు. భూగర్భ మార్గం పనులు జరుగుతున్నాయి. మరో మార్గంలో వంతెన, భూగర్భ మార్గం పనులు వేగం పుంజుకున్నాయి. 
 
 ముగింపు దశలో పనులు: కోయంబేడు నుంచి మౌంట్ వరకు దాదాపు నిర్మాణ పనులు ముగింపు దశకు చేరాయి. విద్యుద్దీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. 2014 ఏప్రిల్‌లో ఈ మార్గం లో రైలు నడపాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో కొంతదూరం ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని హంగులతో సిద్ధమైన నాలుగు బోగీలతో కూడిన రైలును కోయంబేడు వద్ద పట్టాలు ఎక్కించారు. ఆ రైలు పనితీరును, అందులోని యంత్రాలు, పరికరాలు, ఏసీ బోగీలోని పరికరాలు, వాటి ఉపయోగానికి సం బంధించిన పరిశీలనలో అధికారులు ఉన్నారు. 
 
 విద్యుత్ సరఫరా అందించడంతో పాటు ఇత ర సాంకేతిక సంబంధిత పనులు చేస్తున్నారు. ఈ పనులు మరికొద్ది రోజుల్లో ముగియనుండడంతో కోయంబేడు మార్గంలో 850 మీటర్ల మేరకు తొలి విడతగా రైలును ప్రయోగాత్మకంగా నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. జనవరి నుంచి మూడు నెలలు ఆ మార్గంలో పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ నిర్వహించనున్నామని, ఏప్రిల్‌లో ప్రయాణికులతో రైళ్లు పరుగులు తీస్తాయని ఆ ప్రాజెక్టు అధికారి ఒకరు పేర్కొన్నారు. సెంట్రల్ - కోయంబేడు- మౌంట్ మార్గం, తిరువొత్తియూరు - సైదాపేట మీదుగా మీనంబాక్కం మార్గంలో 42 రైళ్లను నడపాలన్న నిర్ణయంతో పనులు వేగవంతం చేశామన్నారు. మరికొద్ది రోజుల్లో రెండు, మూడో రైలు బ్రెజిల్ నుంచి చెన్నైకు రానున్నాయని వివరించారు. 
 
 రైలు రెడీ: బ్రెజిల్‌లో రూపుదిద్దుకున్న నాలుగు బోగీలతో కూడిన మెట్రో రైలును ఇటీవల చెన్నైకు తీసుకొచ్చారు. ఒక్కో బోగీలో కిటికీలకు ఇరు వైపులా ప్రయాణికులు కూర్చునేందుకు సీట్లు ఏర్పాటుచేశారు. మధ్య భాగంలో నిలబడే వారి కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించారు. వికలాంగులు, వృద్ధుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ రైలును మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు నగర శివారులోని పారిశ్రామికవాడలో కొద్ది రోజులు ఉంచారు. ప్రస్తుతం అన్ని హంగులతో రైలు సిద్ధమైంది. కోయంబేడు వద్ద పట్టాలెక్కిన మెట్రో రైలును చూడ్డానికి జనం తీవ్ర యత్నాలు చేస్తున్నా, దరిదాపుల్లోకి ఎవర్నీ రానివ్వకుండా అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
 
>
మరిన్ని వార్తలు