కుమార్‌ విశ్వాస్‌ ఒంటరయ్యారా?

17 Jun, 2017 20:34 IST|Sakshi
కుమార్‌ విశ్వాస్‌ ఒంటరయ్యారా?

న్యూఢిల్లీ : కుమార్‌ విశ్వాస్‌పై ఆరోపణలు సంధించేవారి సంఖ్య ఆమ్‌ ఆద్మీ పార్టీలో రోజు రోజుకు పెరుగుతోంది. కుమార్‌ విశ్వాస్‌ బిజెపితో కుమ్మక్కయ్యారని  ఎమ్మెల్యే అమానతుల్లా చేసిన ఆరోపణలు సద్దుమణకగముందే తాజాగా ఆయనను బిజెపి మిత్రునిగా అభివర్ణిస్తూ ఆప్‌ కార్యాలయం వెలుపల పోస్టర్లు వెలిశాయి. కుమార్‌ విశ్వాస్‌ను బిజెపికి మిత్రునిగానే కాకుండా ఆప్‌ ద్రోహిగా, మోసగాడికి ఈ పోస్టర్లు పేర్కొన్నాయి.

బిజెపి పట్ల కుమార్‌ విశ్వాస్‌ అనుసరిస్తోన్న మెతక వైఖరిని ప్రశ్నిస్తూ ఆప్‌ నేత దిలీప్‌ పాండే ట్వీట్‌ చేసిన కొద్ది రోజులకే వెలుగు చూసిన ఈ పోస్టర్లు కుమార్‌ విశ్వాస్‌ గురించిన నిజాన్ని బయటపెట్టినందుకు దిలీప్‌ పాండేకు కృతజ్ఞతలు తెలిపాయి. పోస్టర్లు ముద్రించిన వారు తమ పేరు బయట పెట్టకుండా కేవలం కుమార్‌ విశ్వాస్‌ను పార్టీ నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా అమానతుల్లా ఖాన్‌ ఆరోపణలతో ఆగ్రహించిన కుమార్‌ విశ్వాస్‌ను ఆప్‌ బుజ్జగించి రాజస్థాన్‌గా ఇన్‌చార్జిగా చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ ఇన్‌చార్జ్‌ హోదాలో నిర్వహించిన సమావేశంలో కుమార్‌ విశ్వాస్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చాలా మందికి రుచించడం లేదు. దానితో పార్టీలో పలువురు నేతలు ఆయనపై కత్తులు నూరుతున్నారు.దిలీప్‌ పాండే వంటి వారు కొందరు బాహాటంగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు.కొత్తగా పార్టీ ట్రెజరర్‌గా నియమితుడైన దీపక్‌ బాజ్‌పేయి కూడా ఇటీవల ఆయనపై మండిపడ్డారు.

గోవా ఎన్నికలలో పార్టీ నేతలు ఐదు నక్షత్రాల హోటళ్లలలో బస చేసి పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని కుమార్‌ విశ్వాస్‌ చేసిన వ్యాఖ్యలపై దీపక్‌ బాజ్‌పేయి ట్విట్టర్‌పై మండిపడ్డారు. నలువైపుల నుంచి వెల్లువెత్తుతున్న ఆరోపణలతో, విమర్షలతో కుమార్‌ విశ్వాస్‌ పార్టీలో ఒంటరైన సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనను పార్టీ నుంచి బయటకు తరిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్‌ నుంచి సస్పెండైన మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. కుమార్‌ విశ్వాస్‌ను కొద్ది రోజులలో ఆప్‌ బహిష్కరిస్తుందని ఆయన అన్నారు కూడా.

>
మరిన్ని వార్తలు