గిన్నిస్ రికార్డు

18 Feb, 2014 01:35 IST|Sakshi
గిన్నిస్ రికార్డు
రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరం గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. రక్తదానంలో హర్యానా రికార్డును తమిళనాడు తిరగరాసింది. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని సీఎం జయలలితకు గిన్నిస్ ప్రపంచ రికార్డు సంస్థ ప్రతినిధి లూసియూ అందజేశారు. 
 
సాక్షి, చెన్నై: సీఎం జయలలిత ఈనెల 24న 66వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. అన్నాడీఎంకే, అనుబంధ విభాగాల నేతృత్వంలో ఆమె పుట్టినరోజు వేడుకలు కోలాహలంగా జరుగుతూ వస్తున్నాయి. క్రీడలు, మారథాన్‌లు, సంక్షేమ పథకాల పంపిణీ, సామూహిక వివాహాలు, వైద్యశిబిరాలు, ఇలా రోజుకో రీతిలో వేడుకలు అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ నేతృత్వంలో చెన్నై, కోయంబత్తూరు, తిరునల్వేలి, విల్లుపురం, కరూర్, సేలం, తిరుచ్చి, కుంబకోణం, వేలూరు, మదురై నగరాల్లో ఏక కాలంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి విశేష స్పందన వచ్చింది. రవాణా శాఖ ఉద్యోగ సిబ్బంది వేలాదిగా తరలి వచ్చారు. 42 బ్లడ్ బ్యాంకుల సహకారంతో అన్ని చోట్ల ఏక కాలంలో ఈ శిబిరాలు జరిగాయి.
 
గిన్నిస్ రికార్డు: సీఎం జయలలిత పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం గిన్నిస్   రికార్డులోకి ఎక్కింది. గతంలో హర్యానాలో ఒకే రోజు జరిగిన శిబిరంలో 43 వేల మంది రక్తదానం చేశారు. హర్యానా పేరిట ఉన్న గిన్నిస్ రికార్డును తిరగరాస్తూ రాష్ట్రంలో 53,129 మంది ర క్తదానం చేశారు. దీంతో గిన్నిస్ ప్రపంచ రికార్డులోకి ఈ మెగా రక్తదాన శిబిరం ఎక్కింది. గిన్నిస్ రికార్డు గుర్తింపు పత్రాన్ని ఆ సంస్థ ప్రతినిధి లూసియూ సోమవారం సీఎం జయలలితకు అందజేశారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సెంథిల్ బాలాజీతో కలసి సీఎం జయలలితను లూసియూ కలుసుకున్నారు.  రికార్డు గుర్తింపు పత్రాన్ని జయలలితకు అందజేశారు.
 
ఆనందంగా ఉంది: రికార్డు గుర్తింపు పత్రాన్ని అందుకున్న జయలలిత ప్రసంగిస్తూ, తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఇంత పెద్ద ఎత్తున రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానంతో మరొకరికి పునర్జన్మను ఇవ్వొచ్చని పేర్కొంటూ, అన్ని దానాల్లో గొప్పదైన రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. మంత్రి సెంథిల్ బాలాజీ, ఆ శాఖ అధికారులు, సిబ్బంది చేసిన కృషి, సేవకు ఫలితంగా ఈ రికార్డు తమిళనాడు వశమైందని చెప్పారు. ఈ రికార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని, తన జన్మదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది రక్తదానం చేయడం మహా ఆనందంగా ఉందని ప్రశంసించారు.  
 
మరిన్ని వార్తలు