ప్రగతికి పది సూత్రాలు...! | Sakshi
Sakshi News home page

ప్రగతికి పది సూత్రాలు...!

Published Tue, Feb 18 2014 1:34 AM

ప్రగతికి పది సూత్రాలు...!

 మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగేందుకు చిదంబరం ప్రణాళిక
 
 న్యూఢిల్లీ: మరో మూడు దశాబ్దాల్లో ... అంటే 2043 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించేందుకు దోహదపడే 10 సూత్రాల ప్రణాళికను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. లోక్‌సభలో సోమవారం 2014-15 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ సంగతి వెల్లడించారు. ‘స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పరిమాణంపరంగా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంది. మున్ముందు ఇండియా మరిన్ని ఘన విజయాలు సాధించనుంది. వచ్చే మూడు దశాబ్దాల్లో మన నామమాత్రపు జీడీపీ భారత్‌ను మూడో ర్యాంకులో నిలబెడుతుందని పలువురి అభిప్రాయం. అమెరికా, చైనాల తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌దే అవుతుంది. అభివృద్ధి చెందిన దేశాల అదృష్టం ప్రభావం ఇప్పుడు వర్ధమాన దేశాలపై పడినట్లే భవిష్యత్తులో చైనా, ఇండియాల ప్రభావం మిగిలిన ప్రపంచంపై గణనీయంగా ఉంటుంది. కనుక భారత ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం మన బాధ్యత...’ అని చిదంబరం తెలిపారు.
 
 ద్రవ్య పటిష్టీకరణ: 2016-17 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 3%కి తగ్గించాలి. ద్రవ్యలోటును ఎప్పటికీ దీనికంటే తక్కువగానే ఉంచాలి.
 
 విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలి: కరెంటు అకౌంటు లోటు మరి కొన్నేళ్లపాటు ఉంటుంది కాబట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ). విదేశీ సంస్థాగత పెట్టుబడులు(ఎఫ్‌ఐఐ), విదేశీ వాణిజ్య రుణాల(ఈసీబీ) వంటి విదేశీ పెట్టుబడులతోనే సమస్యను అధిగమించాలి. కనుక విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలి.
 
 ధరల స్థిరీకరణ, అభివృద్ధి: అధిక వృద్ధి రేటు లక్ష్యంగా ఉన్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థలో ఓ మాదిరి ద్రవ్యోల్బణ రేటు ఆమోదయోగ్యమే. ద్రవ్య
 
 
 విధాన రూపకల్పన  సమయంలో ధరల స్థిరీకరణ - వృద్ధి విషయంలో సమతుల్యాన్ని రిజర్వు బ్యాంకు సాధించాల్సి ఉంది.
 
 ద్రవ్య సంస్కరణలు: ద్రవ్య, శాసన సంస్కరణల సంఘం సిఫార్సులను తక్షణమే అమలు చేయాలి. ఇందుకు చట్టాల్లో మార్పుల అవసరం లేదు.
 
 మౌలిక సౌకర్యాలు: దేశంలో మౌలిక సౌకర్యాలను పునర్నిర్మించాలి. కొత్త సౌకర్యాలను భారీగా కల్పించాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిని మరింత విస్తృతంగా వినియోగించాలి. పెట్టుబడుల సమీకరణ, దీర్ఘకాలిక నిధుల కోసం కొత్త సంస్థలను నెలకొల్పాలి.
 తయారీ రంగం: ప్రభుత్వం ఈ రంగంపై దృషి ్టసారించాలి. ముఖ్యంగా ఎగుమతులకు ఉద్దేశించిన తయారీరంగంపై దృష్టికేంద్రీకరించాలి. ఎగుమతయ్యే ఉత్పత్తులపై రాష్ట్ర, కేంద్ర పన్నులను రద్దు చేయాలి లేదా తగ్గించాలి. వస్తువులను దిగుమతి  కంటే   ఇక్కడే తయారు చేసేలా ప్రోత్సహించేందుకు కనీస ధర రక్షణ కల్పించాలి.
 
 సబ్సిడీలు: వనరులు పరిమితంగానూ, వాటిని కోరేవారు అధికంగానూ ఉన్నందున ప్రభుత్వం నిజంగా సబ్సిడీలు అవసరమైన వారిని గుర్తించి, పూర్తిగా అర్హులైన వారికే ఇవ్వాలి.
 నగరీకరణ: ప్రభుత్వం తగినంత దృష్టి సారించని పక్షంలో దేశంలోని నగరాలు పాలించలేనివిగానూ, నివసించజాలనివిగానూ మారే అవకాశముంది. పౌరులకు మరింత మెరుగైన పాలన అందించే విధంగా కొత్త వనరులను సృష్టించి, వినియోగించాలి.
 
 నైపుణ్యాల వృద్ధి: మాధ్యమిక విద్య, యూనివర్సిటీ విద్య, సంపూర్ణ పారిశుధ్యం, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణలతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనివ్వాలి.
 
 బాధ్యతలు పంచుకోవాలి: ప్రధాన ప్రాజెక్టుల ఆర్థిక వ్యయంలో సహేతుకమైన భాగాన్ని భరించడానికి రాష్ట్రాలు సుముఖంగా ఉండాలి. తద్వారా రక్షణ, రైల్వేలు, జాతీయ రహదారులు, టెలికమ్యూనికేషన్ల వంటి రంగాలకు కేంద్రం మరిన్ని నిధులు కేటాయించగలుగుతుంది.
 

Advertisement
Advertisement