ఉద్యోగం పేరిట యువతికి టోకరా

7 Oct, 2016 10:04 IST|Sakshi

స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగమిప్పిస్తానని రూ.12 లక్షలు వసూలు
పెందుర్తి పోలీసుల అదుపులో నిందితుడు  
 
 పెందుర్తి : ప్రముఖ ప్రభుత్వరంగ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ ప్రబుద్దుడిని  పెందుర్తి పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఉన్నత విద్య అభ్యసించిన ఓ యువతి నిందితుడి చేతిలో మోసపోయింది. ఆమె ఫిర్యాదుతో సదరు మోసగాడిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ ఎ.విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఎన్‌ఏడీ ప్రాంతానికి చెందిన వేదుల రాఘవేంద్ర ప్రసాద్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని తిరుగుతుంటాడు.
 
 అతడికి కొన్నాళ్ల కిందట శ్రీనివాస్‌నగర్‌కు చెందిన అందుకూరి కృతిక అనే యువతి పరిచయమయింది. బీటెక్ చదువుకున్న ఆమె ఉద్యోగ ప్రయత్నంలో ఉందని తెలుసుకున్న ప్రసాద్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ మేరకు కృతిక వద్ద నుంచి రూ.12 లక్షలు రెండు దఫాలుగా తీసుకున్నాడు. అరుుతే ఎన్నాళ్ల యినా ఉద్యోగం రాకపోయేసరికి అనుమానం వచ్చిన ఆమె ప్రసాద్‌ను నిలదీసింది. చివరకు అతడు చేసిన మోసం తెలియడంతో పెందుర్తి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
 
 దీంతో నిందితుడు ప్రసాద్‌ను సీఐ జె.మురళి ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు ప్రసాద్ గతంలో కూడా శ్రీనివాసరావు అనే నిరుద్యోగి వద్ద రూ. 5లక్షలు తీసుకున్నాడని తెలిసింది. అప్పుడు కూడా ప్రసాద్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రసాద్ చేతిలో మరికొంత మంది నిరుద్యోగులు మోసపో యినట్లు పోలీసులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు