చిన్నమ్మకు జేజేలు

11 Oct, 2017 03:41 IST|Sakshi

మేళతాళాలతో ఆహ్వానం

అభిమానుల పిల్లలకు జయలలిత, జయకుమార్‌ పేర్లు

నాలుగో రోజూ నటరాజన్‌కు పరామర్శ

నేటితో ముగియనున్న పెరోల్‌ – పళని వర్గాలతో మంతనాలా..?

రెండు రోజులు అభిమానులు, మద్దతుదారులు కాస్త సంయమనం పాటించినా, నాలుగో రోజు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. చిన్నమ్మ శశికళకు జేజేలు పలుకుతూ, మేళ తాళాల నడుమ ఆహ్వానం పలకడం గమనార్హం.నాలుగో రోజుగా భర్త నటరాజన్‌ను పరామర్శించిన శశికళ, అభిమానుల పిల్లలకు జయలలిత, జయకుమార్‌ అనే నామకరణం చేశారు.


సాక్షి, చెన్నై : పెరుంబాక్కంలోని గ్లోబల్‌ హెల్త్‌ సిటీలో అవయ మార్పిడి శస్త్ర చికిత్సతో ఐసీయూలో ఉన్న భర్త నటరాజన్‌ను పరామర్శించేందుకు పెరోల్‌ మీద చిన్నమ్మ శశికళ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బెంగళూరు పరప్పన అగ్రహార చెర నుంచి బయటకు వచ్చిన చిన్నమ్మకు మద్దతుదారులు తొలిరోజు బ్రహ్మరథం పట్టారు. పెరోల్‌ మీద బయటకు వచ్చిన వారికి ఇంతటి ఆహ్వానమా..? అని పెదవి విప్పిన వాళ్లూ ఉన్నారు. మరుసటి రోజు అభిమానోత్సాం సద్దుమణిగింది.

మద్దతుదారుల జాడ కాన రాలేదు. అయితే, ఆస్పత్రికి ప్రతిరోజూ చిన్నమ్మ వచ్చి పరామర్శించి తిరిగి టీ నగర్‌లోని ఇంటికి వెళుతున్నారు. ఈ సమయంలో బంధువులు, కుటుంబీకులతో మంతనాల్లో చిన్నమ్మ బిజీబిజీ అయ్యారని సమాచారం. రెండు రోజుల పాటుగా మద్దతుదారులు, అభిమానుల ఉత్సాహం సద్దుమణిగిన నేపథ్యంలో హంగామా ముగిసినట్టుందంటూ ఎద్దేవా చేసే వాళ్లూ పెరిగారని చెప్పవచ్చు. అందుకే కాబోలు నాలుగో రోజు మంగళవారం పెద్దఎత్తున మద్దతుదారులు తరలి వచ్చి మరీ చిన్నమ్మకు జేజేలు పలకడం గమనార్హం.

అభిమానుల హడావుడి
టీ.నగర్‌లోని నివాసం  నుంచి ఉదయాన్నే ఆస్పత్రికి చిన్నమ్మ బయలుదేరారు. ఈ సమయంలో ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో మహిళా మద్దతుదారులు చేరుకుని చిన్నమ్మకు జేజేలు కొట్టడమే కాకుండా. ఆమెకు ఉన్న దిష్టి అంతా తొలగి పోవాలంటూ దిష్టి గుమ్మిడి కాయల్ని కొట్టి మరీ అభిమానాన్ని చాటుకున్నారు.

పెరుంబాక్కంకు వెళ్లే మార్గంలో అక్కడక్కడ మద్దతుదారులు చేతులు ఊపుతూ, జిందాబాద్‌లు కొడుతూ ఆహ్వానం పలికారు. ఇక, ఆస్పత్రి ఆవరణలో పండుగ వాతావరణం తలపించే రీతిలో మేళ తాళాలు హోరెత్తాయి. డప్పు వాయిదాల జోరు నడుమ  బ్రహ్మరథం పట్టారు. ఆస్పత్రిలో భర్త నటరాజన్‌ను పరామర్శించిన అనంతరం వెలుపలకు వచ్చిన చిన్నమ్మను మద్దతుదారులు చుట్టుముట్టారు.

అభిమానుల పిల్లలకు నామకరణం
కన్నగి నగర్‌కు చెందిన ఇలవరసన్, అన్నపూర్ణ దంపతులు తమ పాపకు పేరు పెట్టాలని విన్నవించారు. ఆ పాపకు జయలలిత అని నామకరణం చేశారు. అలాగే, భారతీ నగర్‌కు చెందిన ఎలుమలై, లక్ష్మి దంపతుల మగ బిడ్డకు జయకుమార్‌ అని పేరు పెట్టారు. మద్దతుదారుల్ని పలకరిస్తూ చిన్నమ్మ కాన్వాయ్‌ టీ.నగర్‌ వైపు  సాగింది.

నేటితో ముగియనున్న పెరోల్‌
బుధవారంతో పెరోల్‌ ముగియనుండడంతో చిన్నమ్మకు వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున మద్దతుదారులు తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, చిన్నమ్మ రాకతో అన్నాడీఎంకే కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆశతో ఉన్న  దినకరన్‌కు మిగిలనుంది ఏమిటో..! అని దినకరన్‌ను ప్రశ్నించగా, మంత్రులు జోకర్‌ల వలే మాట్లాడుతున్నారని విమర్శించే పనిలో పడ్డారు.


పళనిస్వామిపై ఆగ్రహం
సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి చిన్నమ్మ దృష్టి అంతా పార్టీ వ్యవహారాల మీదు సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సీఎం పళని స్వామికి సన్నిహితులుగా ఉన్న వారితో శశికళ తన మద్దతుదారుల ఫోన్‌ ద్వారా మాట్లాడినట్టు ప్రచారం. పళనిస్వామి తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు, పలువురు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై అసహనాన్ని వ్యక్తంచేసినట్టు సమాచారం.  పార్టీని రక్షించుకునే విధంగా ముందుకు సాగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ నిర్వీర్యం కావడానికి వీలు లేదని మద్దతుదారులకు సూచించినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు