కరోనా: జిల్లాలో ఒక్కరోజే 11 పాజిటివ్‌ కేసులు

12 Apr, 2020 11:03 IST|Sakshi
నేరేడుచర్ల : కరోనా పాజిటివ్‌ వ్యక్తితో మాట్లాడుతున్న వైద్యులు, పోలీస్‌ సిబ్బంది

సూర్యాపేటలో 9, తిరుమలగిరి, నేరేడుచర్లలో ఒక్కో కేసు నమోదు

ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 20 కరోనా కేసులు

జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్‌

ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు అంటుకున్న వైరస్‌

సాక్షి, సూర్యాపేట : జిల్లాలో శనివారం ఒక్కరోజే 11 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో జిల్లా ప్రజల్లో భయాందోళన నెలకొంది. సూర్యాపేట పట్టణంలో 9, తిరుమలగిరి, నేరేడుచర్లలో ఒక్కో కేసు నమోదైంది. మర్కజ్‌ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు వైరస్‌ అంటుకోవడంతో జిల్లావాసులు వణికిపోతున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీతోపాటు జిల్లాలోని నాగారం, తిరుమలగిరి, నేరేడుచర్ల మండలాలకు వైరస్‌ వ్యాప్తి చెందడంతో.. అధికారులు హై అలర్ట్‌ అయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 20 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

ఆ.. కేసు తేలింది..
ఈ నెల 8న సూర్యాపేట పట్టణంలోని కొత్తగూడెం బజార్‌కు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పరీక్షల్లో తేలింది. కరోనా లక్షణాలు ఉండడంతో తానే స్వయంగా జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షల్లో అతనికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలిసింది. అయితే ఇతను పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని ఎవరిని కాంటాక్టు అయ్యాడన్న సమాచారం తొలుత తేలలేదు. ఇతని ద్వారా తన కూతురుకు కూడా శనివారం పాజిటివ్‌ వచ్చింది. కుడకుడ వ్యక్తినుంచి వర్ధమానుకోటలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి వైరస్‌ సోకితే, కొత్తగూడెం బజార్‌లో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కూతుళ్లు వైరస్‌ బారినపడ్డారు. ఇతని నుంచే స్థానిక పాత మార్కెట్‌ పరిధిలోని మరో 8 మందికి కరోనా సోకినట్లు శనివారం రాత్రి అధికారులు ప్రకటించారు.  చదవండి: వారికి ఆకులే మాస్క్‌లు 

డిశ్చార్జ్‌ అయ్యి.. మళ్లీ పాజిటివ్‌..
మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్వారంటైన్లనుంచి కొంతమందిని డిశ్చార్జ్‌ చేశారు. ఇలా చేసిన వారికి చివరలో పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్‌ రాగా, నేరేడుచర్లకు చెందిన వ్యక్తికి మాత్రం పాజిటివ్‌ వచ్చింది. గత నెల చివరలో సదరు వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి వచ్చాడు. అదేవిధంగా జిల్లాలో నమోదైన తొలి కరోనా పాజిటివ్‌ కేసు, కుడకుడకు చెందిన వ్యక్తి మర్కజ్‌ వెళ్లి వస్తూ గత నెల తిరుమలగిరిలో ప్రార్థన మందిరంలో బస చేశాడు. మసీదులో అతనితో ఉన్న వ్యక్తిని కూడా జిల్లా కేంద్రంలోని క్వారంటైన్‌కు తరలించి పరీక్ష చేయడంతో పాజిటివ్‌ అని తేలింది. 

మరిన్ని వార్తలు