లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసులే పెద్ద తలనొప్పి  | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసులే పెద్ద తలనొప్పి 

Published Sun, Apr 12 2020 11:02 AM

Lockdown: Crime Rate Decreased In Srikakulam District - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: లాక్‌డౌన్‌ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా... ఓ రకంగా మంచి కూడా జరుగుతోంది. ఎవరూ బయటకు రాకూడద న్న నిబంధనను కఠినంగా అమలు చేయడం వల్ల కరోనా మహమ్మారే కాదు నేరాలు కూడా కట్టడి అయ్యాయి. జన సంచారం లేకపోవడం, పోలీసుల గస్తీ సాగుతూ, నిరంతర నిఘా ఉండటం వలన క్రైం రేటు పడిపోయింది.  చోరీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు తదితర నేరాలు ప్రతి నెలా సరాసరి 119 వరకు జరిగేవి. కానీ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య ఏడుకు పడిపోయింది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రజలు రోడ్లపైకి రాకుండా లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు.  నిత్యావసర  సరుకుల రవాణా, అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో రోడ్డు ప్రమాదాలు బాగా తగ్గిపోయాయి. జిల్లాలో 3442మంది పోలీసులు నిత్యం రోడ్లపైనే ఉండి, గస్తీ కాసి, నిఘా పెంచడంతో ఎటువంటి నేరాలకు ఆస్కారం లేకుండా పోయింది. 

అందరూ ఇళ్లలోనే.. 
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చోరీలు, దోపిడీలకు ఆస్కారం లేకుండా పోయింది. ప్రతి నెలా సరాసరిన పగటి పూట చోరీలు 1.3 జరిగేవి. ఏప్రిల్‌లో ఒకటీ కూడా జరగలేదు. రాత్రి పూట చోరీలు గతంలో నెలకు సగటున 7.6 జరిగేవి. ఏప్రిల్‌లో ఇప్పటివరకు రెండే జరిగాయి. హత్యలు కూడా అంతే. ప్రతి నెలా సరాసరిన 2.3 చోటు చేసుకోగా ఈనెలలో ఇప్పటివరకు ఒక్కటీ జరగలేదు. గతంలో మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, వేధింపుల కు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. ఇప్పుడవి భారీ గా తగ్గిపోయాయి. ముఖ్యంగా అత్యాచార ఘటన లు ప్రతి నెలా సగటున 4.3 చోటు చేసుకునేవి. ఏప్రిల్‌లో ఒక్కటి కూడా జరగలేదు.  

గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు  
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రమాదాల సంఖ్య త గ్గింది. కరోనా నేపథ్యంలో కర్ఫ్యూ పరిస్థితులు కొ నసాగడంతో ప్రమాదాలకు చెక్‌ పడింది. జిల్లాలో నిత్యం ఏదో ఒక మూల వాహనాలు ఢీకొని రోడ్లు రక్తసిక్తమయ్యేవి. గతంలో ప్రాణాంతక రోడ్డు ప్ర మాదాలు నెలకు సగటున 25.3 చోటు చేసుకోగా, ఇప్పుడవి ఒకటికి పరిమితమయ్యాయి. సా«ధారణ రోడ్డు ప్రమాదాలు ప్రతి నెలా సరాసరిన 59.3 జర గ్గా ఇప్పుడవి మూడుకు తగ్గాయి. మృతుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మద్యం అమ్మకాలు నిలిపివేయడంతో ఆ ప్రభావం కూడా లేదు.  

లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసులే పెద్ద తలనొప్పి 
క్రైం రేటు గణనీయంగా తప్పినా పోలీసులకు లాక్‌డౌన్‌ ఉల్లంఘన పెద్ద సమస్యగా మారింది. ఇష్టాను సారంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 11 వరకు నిత్యావసరాలు, కూరగాయలు, ఇతరత్రా సరుకుల కొనుగోలుకు అవకాశమిచ్చినప్పటికీ.. కొంతమంది అదే పనిగా రోజంతా ద్విచక్ర వాహనాలు, కార్లపై తిరుగుతున్నారు. వారందరిపైన కేసులు నమోదు చేసి, వాహనాలను అదుపులోకి తీసుకుంటున్నారు. జిల్లాలో ఇంతవరకు 3425మందిపై  2718 ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. 1897 వాహనాలు, 474మంది వ్యక్తులు, 346 షాపులపై కేసులు నమోదయ్యాయి. 230 ఎంవీ యాక్ట్‌ కేసులు నమోదు చేసి రూ.71,435 అపరాధ రుసుం వసూలు చేశారు. అనధికారికంగా ధాన్యం తరలిస్తున్న మరో 25 లారీలను కూడా సీజ్‌ చేశారు.  

నేరాలు తగ్గాయి 
లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటం వలన నేరాలు భారీగా తగ్గాయి. రోడ్డు ప్రమాదాలు పెద్ద ఎత్తున కట్టడి అయ్యాయి. పోలీసులు నిరంతరం రోడ్లపైనే ఉండటంతో  చోరీలకు అవకాశమే లేకుండా పోయింది. హత్యలు, హత్యాచారాలు, ఆత్మహత్యలు కూడా చోటు చేసుకోవడం లేదు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో నేరాలకు ఆస్కారం లేకుండా పోయింది. మనతోపాటు పక్కనున్న వారు బాగుండాలనే ధోరణి వారిలో కనిపిస్తోంది. – ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ  

Advertisement

తప్పక చదవండి

Advertisement