కుదిపేసిన అతిసార

1 Jul, 2014 05:10 IST|Sakshi
కుదిపేసిన అతిసార

- గువ్వలదిన్నెలో బాలుడి మృతి
- మరో 20 మందికి తీవ్ర అస్వస్థత
- గ్రామాన్ని సందర్శించిన ఆర్డీఓ

ధరూరు: మండలంలోని గువ్వలదిన్నె గ్రామాన్ని అతిసారవ్యాధి కుదిపేసింది. సోమవారం వాంతులు, విరేచనాలతో ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. మరో 20మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు భయాందోళనతో ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. గ్రామానికి చెందిన వీరన్న, ఆదమ్మల కొడుకు నవీన్(9) గత రెండురోజులుగా తీవ్రమైన వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాడు.

మొదట ఆర్‌ఎంపీకి చూపించగా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కర్ణాటకలోని రాయిచూరు ఆస్పత్రికితీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆ బాలుడు సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడు నవీన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురైన ఉసెనప్పగౌడ్, పద్మమ్మ, జ్యోతి, మల్లేష్‌గౌడ్‌తో పాటు మరో నలుగురిని చికిత్స కోసం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన వైద్యధికారులు గ్రామానికి చేరుకుని వైద్యశిబిరం ఏర్పాటుచేశారు.
 
ఆర్డీఓ సందర్శన..
విషయం తెలుసుకున్న గద్వాల ఆర్డీఓ భిక్షానాయక్, ఇన్‌చార్జి తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ నర్సింహనాయుడు, ఆర్‌డబ్ల్యూస్ ఏఈ బషీర్ తదితరలు గ్రామానికి చేరుకుని సమీక్షించారు. తాగునీటి పైప్‌లైన్‌కు గ్రామానికి చెందిన రైతులు కొందరు డ్రిప్ పైపులను అమర్చి నీటిని అక్రమంగా వాడుకుంటున్నట్లు గుర్తించారు. ఆ డ్రిప్‌పైపులు అమర్చిన ప్రాంతాల్లో నిలిచిన నీరు తిరిగి తాగునీటి పైపుల్లోకి వెళ్లడంతో తాగునీరు కలుషితమైనట్లు గుర్తించారు. ఏడాదికాలంగా ట్యాంకును శుభ్రం చేయడం లేదని..కలుషితనీటినే తాగుతున్నామని స్థానికులు వాపోయారు.
 
రోగులకు మెరుగైన వైద్యం - ఎమ్మెల్యే డీకే అరుణ
గద్వాల న్యూటౌన్: అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే డీకే అరుణ వైద్యాధికారులను ఆదేశించారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గువ్వలదిన్నె వాసులను ఆమె సోమవారం పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం గురించి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. అతిసార ప్రబలుతున్న గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ఆర్డీఓ భిక్షానాయక్‌కు సూచించారు. అతిసార మరింతగా విజృంభించకుండా ప్రత్యేకచర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, శంకర్, తిమ్మన్న, భాస్కర్‌యాదవ్ ఉన్నారు.

మరిన్ని వార్తలు