వయసు తగ్గె.. లెక్క పెరిగె..!

29 Dec, 2018 07:26 IST|Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో పింఛన్‌దారులు మరింత పెరగనున్నారు. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఎంతమంది ఉన్నారనే దానిపై లెక్కలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన లెక్కలు పూర్తికాగానే.. వారిలో అర్హులను గుర్తించి పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ వృద్ధాప్య పింఛన్‌దారుల వయసు కుదిస్తామని, ఇక 57 ఏళ్ల వయసు నుంచి పింఛన్‌ అందిస్తామని ప్రకటించారు. అయితే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందడం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో దీనికి సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత హామీల అమలుపై దృష్టి సారించిన సీఎం.. ఆసరా పింఛన్లపై వెనువెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఆసరా పింఛన్లను అందించేందుకు అర్హులను గుర్తించే పనిని ముమ్మరం చేశారు. 

ఆసరా పింఛన్లు అందుకుంటున్న 63,655 మంది.. 
జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లను 63,655 మంది పొందుతున్నారు. గతంలో ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారికి పింఛన్లు అందజేస్తున్నారు. ప్రతినెలా వీరికి పింఛన్లు సకాలంలో అందుతుండడంతో వీరికి ఎంతో కొంత ఆసరాగా ఉంటోంది. వారి మందులు, ఇతర అవసరాలు తీరుతుండడంతో వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్‌ పొందేందుకు 57 ఏళ్ల వయసును అర్హతగా పేర్కొనడంతో మరింత మందికి పింఛన్లు అందనున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు.. ఇతర కారణాలతో పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు.

60 ఏళ్లలోపే వృద్ధాప్యంతో అనేక మంది తమ పనులు తాము చేసుకోలేని స్థితికి చేరుతున్నారు. పింఛన్‌ తీసుకునే వయసు 65 ఏళ్లు చేయడంతో ఆ కింద వయసు కలిగిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల్లోని వృద్ధులకు కనీస ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో జీవనం కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్‌ వయసు 57 ఏళ్లకు తగ్గించడం.. అలాగే ఆసరా పింఛన్‌ కూడా పెంచడంతో వారికి ఈ డబ్బు ఎంతో ఉపయోగకరంగా మారనున్నది. ఇప్పటివరకు వృద్ధాప్య పింఛన్‌ రూ.1000 ఇచ్చే వారు. అయితే ఇప్పుడు ఆ పింఛన్‌ కూడా రెట్టింపు కావడంతో వృద్ధులకు మందులు, వారికి ఉండే ఇతర అవసరాలకు సొమ్ము చేతిలో ఉండే పరిస్థితి ఉంది. ఏప్రిల్‌ నుంచి వృద్ధాప్య పింఛన్‌ రూ.2,016 చొప్పున అందించనున్నారు.

లెక్కలు కట్టే పనిలో అధికారులు.. 
కొత్తగా వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసేందుకు అధికారులను కసరత్తు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో అందుకు సంబంధించిన పనుల్లో కిందిస్థాయి అధికారులు నిమగ్నమయ్యారు. 2018 నవంబర్‌ ఓటర్ల జాబితా ప్రకారం 57 నుంచి 64 ఏళ్లలోపు వృద్ధులు ఎంతమంది ఉన్నారనేది లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 90,959మంది ఉన్నారు. అయితే 56 ఏళ్లు దాటినవారు 1,81,442 మంది ఉన్నారు. అయితేఅధికారులు 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు ఉన్న వారి లెక్కలను తీసుకుని.. అందులో అర్హులను గుర్తించనున్నారు. అర్హులకు ఏప్రిల్‌ నుంచి వృద్ధాప్య పింఛన్లు అందజేసే అవకాశం ఉంది. 

అర్హులను గుర్తిస్తున్నాం.. 
వృద్ధాప్య పింఛన్లకు అర్హులైన వారిని గుర్తిస్తున్నాం. వృద్ధాప్య పింఛన్‌ అందుకునే వారి వయసు 57 ఏళ్లకు కుదించడంతో ఆ వయసు కలిగిన అర్హులైన లబ్ధిదారులు జిల్లాలో ఎంతమంది ఉన్నారనే దానిపై లెక్కలు తీస్తున్నాం. ఓటరు జాబితాను అనుసరించి మొదట 57 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయసు వారు ఎంతమంది ఉన్నారనేది గుర్తిస్తున్నాం. అందులో నుంచి అర్హుల జాబితాను తయారు చేసి.. ఉన్నతాధికారులకు అందజేస్తాం.  – ఇందుమతి, డీఆర్‌డీఓ

మరిన్ని వార్తలు