‘జాగృతి’ బతుకమ్మ వేడుకలు 

29 Sep, 2019 03:34 IST|Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా 300 చోట్ల ఏర్పాట్లు 

దేశ, విదేశాల్లో మరో 12 చోట్ల సంబురాలు 

ఏర్పాట్లను సమీక్షించిన మాజీ ఎంపీ కవిత 

సాక్షి, హైదరాబాద్‌: ప్రకృతి పూల పండుగ బతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 300కి పైగా ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వ హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాలపై శనివారం ఆయా జిల్లా బాధ్యులతో సమీక్ష నిర్వహించారు. ముంబైతో పాటు అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్‌లతో పాటు 12 దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

జాగృతి బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 30న రవీంద్రభారతిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 316 మంది కవయిత్రుల కవితా పఠనం ఉంటుందన్నారు. అక్టోబర్‌ 2 నుంచి 4వ తేదీ వరకు వరుసగా మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని జేఎన్‌యూ ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో 50 మంది మహిళా ఆర్టిస్టులతో ఆర్ట్‌ వర్క్‌ షాప్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలుగు సాహితీ రంగంలో అతిపెద్ద కవయిత్రుల కవితా సంకలనం ‘పూల సింగిడి’ని వెలువరిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాల వారీగా బతుకమ్మ సంబురాలు నిర్వహించే పట్టణాలు, మండల కేంద్రాల జాబితాను కవిత ఈ సందర్భంగా విడుదల చేశారు.   

>
మరిన్ని వార్తలు