ప్రజలతో మాది పేగు బంధం.. కాంగ్రెస్‌ది చేదు బంధం: ఎమ్మెల్సీ కవిత | Sakshi
Sakshi News home page

ప్రజలతో మాది పేగు బంధం.. కాంగ్రెస్‌ది చేదు బంధం: ఎమ్మెల్సీ కవిత

Published Wed, Nov 29 2023 7:59 AM

MLC Kavitha Special Interview Ahead Of Assembly Elections - Sakshi

‘అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరిన క్రమంలో ప్రజల్లో బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆదరణ కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌కు ప్రజలతో ఉన్నది పేగు బంధం అయితే, కాంగ్రెస్‌తో ఉన్నది చేదు బంధం. కాంగ్రెస్, బీజేపీ సోషల్‌ మీడియాలో సృష్టించే అయోమయం, చెప్పే అబద్ధాల నడుమ బీఆర్‌ఎస్‌ను ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. బీజేపీ గత ఎన్నికల్లోనూ 105 చోట్ల డిపాజిట్‌ కోల్పోయింది. ఈసారి కూడా అంతకంటే గొప్పగా ఏమీ ఉండదు.

కాంగ్రెస్‌ మాకు చాలా దూరంలో ఉన్నా ఎంతో కొంత పోటీనిస్తోంది. అందుకే కాంగ్రెస్‌ ఆలోచన సరళి, అహంకారం, అజ్ఞానం గురించి ప్రజలకు విడమరిచి చెప్తున్నాం’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పదేళ్ల నుంచి కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్యారంటీల పేరిట కాపీ కొట్టి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పబ్బం గడుపుకుంటోందని ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

మీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు చేస్తున్న విమర్శల సంగతేంటి? 
ప్రజాదరణ ఉన్న కేసీఆర్‌ను అందుకోలేని విపక్ష నేతలు ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించేలా దిగజారి మాట్లాడుతున్నారు. కష్టపడేతత్వం లోపించిన విపక్షాలు ఏది పడితే అది మాట్లాడుతున్నాయి. తెలంగాణకు భౌగోళికంగా, రాజకీయంగా గుర్తింపు తెచ్చిన కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న తీరును ప్రజలు ఏవగించుకుంటున్నారు. మాది కుటుంబ పార్టీ అంటున్న వారు మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రజల గొంతు వినిపించి రాష్ట్రాన్ని, అనేక రక్షణలు తెచ్చామనే విషయాన్ని గమనించాలి. లక్ష సవాళ్లు, విష ప్రచారాలను ఛేదించి తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను గతంలో ప్రజలు దీవించారు. ఇప్పుడూ అదే జరుగుతుంది. 

 ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చింది. మీ కష్టం ఎంత మేర ఫలిస్తుంది? 
కేసీఆర్‌ పెద్ద మనసుతో తెచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ కాపీ కొడుతున్నా, అమలు చేసే శక్తి ఎవరికి ఉందో ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు మాకు ఆత్మబంధువులు. సంపదను సృష్టించి తెలంగాణ సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకుని పెట్టిన పథకాలు ఫలితాన్ని ఇస్తున్నాయి. రాష్ట్రంలో వచ్చే 50 ఏళ్లకు అవసరమయ్యే మౌలిక వసతులను దూరదృష్టితో అభివృద్ధి చేస్తున్నాం.

సంక్షేమ పథకాలు, అభివృద్ది మాకు రెండు కళ్ల లాంటివి. మళ్లీ అధికారంలోకి వస్తే దిగువ, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. యువత విషయానికి వస్తే ఈ తరం చాలా తెలివైంది. తెలంగాణ ఉద్యమ సమయంతో పోలిస్తే కొత్త తరానికి సమాచారం అందుబాటులో ఉంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే బాగుంటుందనే విషయంలో కొత్త తరానికి స్పష్టత ఉంది. కేసీఆర్‌ కమిట్‌మెంట్‌ను వీరు గుర్తిస్తారు. 

మహిళా రిజర్వేషన్‌ చట్టంపై మీ తదుపరి కార్యాచరణ ఏంటి? 
2024 లోక్‌సభ ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా భారత జాగృతి తరఫున సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ అవుతాం. డిసెంబర్‌ 3 తర్వాత ఢిల్లీ స్థాయిలో ఉద్యమిస్తాం.

 జాతీయ పార్టీల అగ్రనేతల ప్రచారం మీ పార్టీపై ప్రభావం చూపిందా? 
విపక్షాలకు పీఎంలు, సీఎంలు ఉంటే తెలంగాణకు కేసీఆర్‌ ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ ఫెయిల్‌ కావడంతోనే కాంగ్రెస్‌ గెలిచింది. మా సీఎం కేసీఆర్‌. కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరనేది ఢిల్లీ నేతలు చెప్పడం లేదు. సీల్డ్‌ కవర్‌ సీఎంల చేతిలో రాష్ట్ర భవిష్యత్‌ను పెట్టలేము. కాంగ్రెస్‌ నాయకులకు ప్రజలు, పార్టీ పట్ల కమిట్‌మెంట్‌ లేదు. వ్యక్తిగత ప్రయోజనం తప్ప, ప్రజల కోసం పనిచేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్, బీజేపీలకు లేదు. రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో కేసీఆర్‌ను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నాయి. కేసీఆర్‌ను గెలిపించడంలో తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది. 

రైతుబంధును నిలిపివేయాలనే కాంగ్రెస్‌ ఫిర్యాదుపై ఏమంటారు? 
రైతు కష్టాలను తీర్చేందుకు రైతుబంధు అమలు చేస్తున్నాం. కానీ కాంగ్రెస్‌ రైతుల నోటి ముందు ముద్దను లాక్కొంటున్నది. వీరికి రైతులు, ప్రజల విషయంలో ఎలాంటి పట్టింపు లేదు.   

Advertisement
Advertisement