‘కన్నడ నటుడిని చూసి కేసీఆర్‌ నేర్చుకోవాలి’

27 Aug, 2019 20:15 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్న కేసీఆర్‌ మాటలు ఏమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేనన్ని కంపెనీలు, పరిశ్రమలు మెదక్‌ జిల్లాలో ఉన్నా స్థానికులకు మాత్రం ఉద్యోగాలు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రఘునందన్‌ రావు సమక్షంలో పలువురు మంగళవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్కనున్న కర్ణాటకలో నటుడు ఉపేంద్ర స్థానికులకు ఉద్యోగాలివ్వాలంటూ ఉద్యమం చేస్తున్నాడని, అతన్ని చూసైనా కేసీఆర్‌ నేర్చుకోవాలని హితవు పలికారు. సింగూరు నీళ్లు బీర్ల కంపెనీలకు వెళ్తున్నాయని, తాగేందుకు నీళ్లు లేక ప్రజలు బిస్లరి బాటిళ్లు కొనుక్కోవాల్సి వస్తుందన్నారు.

పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో కాలుష్యం పెరిగిపోయి చిన్న పిల్లలకు శ్వాస ఆడట్లేదన్నారు. సిద్ధిపేట ఒక్కటే తన జిల్లా అనుకొని సిద్ధిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాలకు నిధులు తరలించి అభివృద్ధి చేస్తున్నారని, సీఎం అయ్యాక కేసీఆర్‌ సంగారెడ్డి ప్రజల ముఖమే చూడలేదని మండిపడ్డారు. సిద్ధిపేట కంటే వెనుకబడిన సంగారెడ్డి అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి తాను మాట్లాడనని రాజకీయ జన్మనిచ్చిన తల్లిలాంటి బీజేపీని కాదని కాంగ్రెస్‌లో చేరిన జగ్గారెడ్డికి సంగారెడ్డి ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. సబ్‌కా వికాస్‌ నినాదంతో ప్రజలు బీజేపీ వెంట నడవాలని రఘునందన్‌ రావు కోరారు.   

మరిన్ని వార్తలు