రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తాం

20 Aug, 2019 10:45 IST|Sakshi
మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌ 

ఎంపీ ధర్మపురి అర్వింద్‌  

సాక్షి, సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌) : నిజామాబాద్‌తోపాటు రాష్ట్రంలో కాషాయజెండా ఎగురవేసే వరకూ విశ్రమించబోమని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నాయకత్వంలో దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. సోమవారం నగరంలోని బస్వాగార్డెన్‌లో నిజామాబాద్‌ రూరల్, నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. వారికి ఎంపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

చారిత్రక అవసరం ఉన్నప్పుడు.. చారిత్రక నిర్ణయం తీసుకోవడం నాయకుడి లక్షణమని, మోదీలాంటి నాయకుడిని బలపర్చాలనే బీజేపీలో చేరానన్నారు. పార్టీలకతీతంగా పని చేసి తనను ఎంపీగా గెలిపించారని తెలిపారు. ఒకటే పన్ను, ఒకటే రాజ్యాంగం, ఒకటే ఎలక్షన్, ఒకటే నేషన్‌పై మాట్లాడిన ఘనత మోదీదేనన్నారు. రాష్ట్రంలో ఆగస్ట్‌ 15 తర్వాత సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేస్తానని చెప్పి, ఆరోగ్య శ్రీ పథకాన్ని బంద్‌ చేయించారని ఎద్దేవా చేశారు. 

అండగా ఉంటా 
తనను నమ్మి బీజేపీలో చేరుతున్న డీఎస్‌ అనుచరవర్గానికి తండ్రికి మించి అండగా ఉంటానని, ఏ ఇబ్బంది ఉన్నా.. అర్ధరాత్రయినా వస్తానని అర్వింద్‌ పేర్కొన్నారు. గతంలో పని చేసిన నాయకులందరూ తన సమక్షంలో పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, గీతారెడ్డి, బద్దం లింగారెడ్డి, బస్వా లక్ష్మీనర్సయ్య, నర్సింహరెడ్డి, గజం ఎల్లప్ప, తదితరులు ప్రసంగించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీలపై కాషాయజెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు లోక భూపతిరెడ్డి, కేపీ రెడ్డి, అడ్లూరి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సినీ రచయిత డాక్టర్‌ శ్రీనాథ్, పీఆర్‌ సోమానీ, గోపాల్, న్యాలం రాజు, రమాకాంత్‌ పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు