పని ప్రదేశాల్లో అతివలకు అండగా..

6 Sep, 2019 11:49 IST|Sakshi

అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు

ఖమ్మం జిల్లా విద్యాశాఖలో సుమారు 10 వేల మంది ఉద్యోగినులు

పని ప్రదేశాల్లో వేధింపులకు చెక్‌ పెట్టేందుకు 

విద్యాశాఖ కసరత్తు

సాక్షి, ఖమ్మం: సమాజంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలకు ఇంకా ఎక్కువ సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా పని ప్రదేశాల్లో వేధింపులను గుర్తించి మహిళలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు అంతర్గత కమిటీలను నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వేధింపులను నివారించటానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు అందాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు కార్యాలయాల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయటానికి సన్నాహాలు ప్రారంభించారు.  

ఇప్పటికే ఉన్నతాధికారులకు పలువురి ఫిర్యాదులు 
జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల తదితర చోట్ల సుమారు 10వేల మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారుల అంచనా. పని ప్రదేశాల్లో వీరిని పురుష ఉద్యోగులు వివక్షకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని కొందరు మహిళా ఉద్యోగులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన సంఘటనలున్నాయి. మరికొంత మంది వేధింపులకు గురవుతున్నా విన్నవించుకునేందుకు ధైర్యం చేయలేని పరిస్థితి ఉంది. ఇలాంటి వారికి అండగా ఉండేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.  

కమిటీ నిర్వహణ ఇలా.. 
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల్లో పది మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న చోట కమిటీలు ఏర్పాటుచేసుకోవాలి. దీనిలో అనుభవం కలిగిన అధికారిని కమిటీ చైర్మన్‌గా నియమిస్తారు. మండలాల్లోని కార్యాలయాల్లో నియమించిన కమిటీ సభ్యుల నుంచి జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్న సహచర ఉద్యోగుల నుంచి వేధింపులు, ఒత్తిడులు ఎదురైతే కమిటీ సమావేశమై చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. ఒక వేళ సంబంధిత ఉద్యోగులు అప్పటికీ వేధింపులు మానుకోకపోతే కమిటీ సభ్యులు అంతా చర్చించి అతనిపై చర్యలు తీసుకుంటారు. ఈ కమిటీలు ఏర్పాటు చేయటం వల్ల మహిళా ఉద్యోగులకు వేధింపులు అరికట్టటానికి అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల, ఏదైనా పది మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటే తప్పనిసరిగా కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. లేనిపక్షంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంటామని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.  

కమిటీ ఏర్పాటు చేయకుంటే జరిమానా
మహిళా ఉద్యోగినిలు 10మంది కంటే ఎక్కువగా ఉండి.. అక్కడ మహిళలకు సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయకుంటే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. కమిటీ ఏర్పాటు చేయకపోవడం వల్ల రూ.50వేలు జరిమానా విధించనున్నారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసే కమిటీల నియామకంపై తాత్సారం చేయవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

అవగాహన సదస్సులు 
 బాలికలు, యువతులు, విద్యార్థినులు, మహిళలపై వేధింపులు అధికంగా ఉంటున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడితే కలిగే నష్టాలు, కేసులు, చట్టాల గురించి పోలీస్‌ శాఖాధికారులు షీ టీమ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలు, ప్రయాణ ప్రాంగణాలపై షీ టీమ్‌ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మహిళలపై దాడులు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు, చిన్న పిల్లల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధానం అమలు చేయడం వల్ల జిల్లాలోని పోకిరీల ఆగడాలకు కొంత అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.  

కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి 
పది మంది మహిళా ఉద్యోగినిలు ఉంటే తప్పకుండా కమిటీ ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించిన ఆదేశాలు మాకు అందాయి. కమిటీ ఏర్పాటు చేయని పక్షంలో రూ.50వేల జరిమానా విధించాలని మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే మా శాఖ కార్యాలయంలో కమిటీ ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో సైతం కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించాం.  
–మదన్‌మోహన్, ఖమ్మం డీఈఓ  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా