ప్రాణాలు తీశారు.. దోచుకెళ్లారు

13 Sep, 2014 04:28 IST|Sakshi
ప్రాణాలు తీశారు.. దోచుకెళ్లారు

 రఘునాథపల్లి : ఆ అర్ధరాత్రి వారికి కాళరాత్రి అయ్యింది. ఇంట్లో గాఢనిద్రలో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులపై దోపిడీ దొంగలు దాడికి పాల్పడ్డారు. పసిపిల్లలు, వృద్ధులు అని చూడకుండా కిరాతకంగా ప్రవర్తించారు. రాడ్లతో చితకబాది నగలు, నగదు ఎత్తుకెళ్లారు. రఘునాథపల్లిలో శుక్రవా రం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిచింది. పోలీసుల కథనం ప్రకారం... మండల కేంద్రానికి చెందిన చెరుకు నర్సింహ, రేణుక దంపతులు గీత వృత్తి చేస్తూనే కుటుంబ సభ్యులతో హోటల్ నిర్వహిస్తున్నారు. వారి కూతురు అఖిరానందిని(11), కుమారుడు హర్షవర్ధన్ జనగామ ఎస్‌వీఆర్ పాఠశాలలో చదువుతున్నారు. రోజూ పాఠశాలకు బస్సులోనే వెళ్లొస్తున్నారు. కాగా రేణుక తండ్రి ఇటీవల మృతిచెందడంతో అప్పటి నుంచి ఆమె తల్లి లచ్చమ్మ(51) కూతురి వద్దే ఉంటోంది.

ఈ క్రమంలోనే ఈ నెల 8న న ర్సింహ తండ్రి కొమురయ్య ఆనారోగ్యంతో మృతిచెందగా గురువారం ఐదోరోజు కార్యక్రమం చేశారు. అనంతరం రాత్రి న ర్సింహ తన అత్త లచ్చమ్మను, ఆమె తల్లి లింగంపల్లి రాధమ్మ(71)తోపాటు పిల్లలు  హర్షవర్దన్, అఖిరా నందినిని హోటల్‌లో పడుకోమని చెప్పి పంపాడు. నలుగురు ముందు గదిలో నిద్రిస్తుండగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగు లు ఇంటి వెనకాల ఉన్న తలుపును పైకి లేపి ప్రవేశించారు.

దొంగల అలికిడి విని వారు నిద్రలేచి అరవడంతో వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. చిన్నారి నందినికి గదవ భాగంలో తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందగా మిగతావారంతా తీవ్రగాయూలతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతరం దొంగలు లచ్చమ్మ, రాధమ్మ ఒంటిపై ఉన్న నగలతోపాటు బీరువాలోని రూ.80 వేల నగదు, గల్లగురిగిలోని రూ.10 వేలకుపైగా నాణాలు, రెండు, మూడు తులాల బంగారు పుస్తెలతాళ్లు, మూడు తులాల నగలు, చిన్నారులకు చెందిన నాలుగు ఉంగరాలను దోచుకెళ్లారు.
 
పక్కింటికి గడియ పెట్టి దారుణం..
నర్సింహ హోటల్ పక్కనే అతడి అక్క కోళ్ల అండాలు తన కుటుంబ సభ్యులతో మరో హోటల్ నిర్వహిస్తోంది. గురువారం రాత్రి ఆమె కుమారుడు సందీప్ స్నేహితులతో కలిసి హోటల్ వెనుక గదిలో నిద్రించాడు. పక్క హోటల్‌లో దోపిడీకి వచ్చిన దొంగలు వారి తలుపు గడియపెట్టారు. ఉద యం లేచాక సందీప్ తలుపు తీయబోగా తెరుచుకోలేదు. బయట గడియ పెట్టినట్లు గుర్తించిన అతడు తన తల్లి అండాలుకు ఫోన్ చేశాడు. దీంతో అతడి తమ్ముడు వచ్చి తలుపు గడియ తీశారు. 8 గంటల ప్రాంతంలో హరీష్ స్నానం చేసేందుకు బకెట్ తెచ్చుకునేందుకు నర్సింహ ఇంటి వెనకాలకు వెళ్లగా తలుపు తొలగించి ఉండటంతో దొంగలు పడిన ట్లు భావించాడు.

లోపలికి వెళ్లి చూడగా రక్తపుమడుగులో కొనఊపిరితో ఉన్న హర్షవర్దన్ డాడీ.. డాడీ అని పిలుస్తూ కనిపించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన హరీష్ వెంట నే తండ్రి శ్రీనుకు సమాచార మిచ్చాడు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చూడగా అప్పటికే అఖిరానందిని, లచ్చమ్మ మృతి చెందగా, అపస్మారకస్థితిలో ఉన్న హర్షవర్ధన్, రాధమ్మను ఆస్పత్రికి  తరలించారు. రాధమ్మ చికిత్సపొందుతూ మృతిచెందింది.
 
రోదనలతో మిన్నంటిన రఘునాథపల్లి
దారణం గురించినవార్త దావలంలా వ్యాపించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, 3స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారి రోదనలతో రఘునాథపల్లి మార్మోగింది. ఈ ఘటనను చూసిన స్థానికులు కన్నీరుపెట్టారు. వరంగల్ రేంజ్ డీఐజే కాంతారావు, వరంగల్ రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాస్, అడిషనల్ ఎస్పీ కె శ్రీకాంత్ , జనగామ డీఎస్పీ కూర సురేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫింగర్ ప్రింట్ సీఐ రఘు బృందం అణువణువు క్షుణ్ణంగా పరిశీలించి వేలిముద్రలు సేకరించారు.  డాగ్ స్క్వాడ్ పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలించింది.   
 
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : డిప్యూటీ సీఎం రాజయ్య
మృతుల కుటుంబాలను ఆదుకుంటామని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆయ న పరామర్శించి ఓదార్చారు. దుండగులను వెంటనే పట్టుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి, ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ సభ్యురాలు బానోతు శారద, టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ రవి, నాయకులు బుచ్చయ్య, రాంబాబు, గోపాల్‌నాయక్ ఉన్నారు.

మరిన్ని వార్తలు