త్వరలో కానిస్టేబుళ్ల బదిలీలు

30 May, 2014 02:22 IST|Sakshi

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో త్వరలో కానిస్టేబుళ్ల బదిలీలు జరుగనున్నాయి. వివిధ ఠాణాల్లో దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు ఈ బదిలీల్లో స్థానభ్రంశం కలుగనుంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ కసరత్తు ప్రారంభించారు. పోలీసు శాఖలో కౌన్సెలింగ్ విధానంలో బదిలీలకు ఆయన స్వీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీర్ఘకాలికంగా ఒకే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్ల బదిలీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

 పలువురికి స్థానభ్రంశం
 ఐదేళ్ల నుంచి ఒకే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు బదిలీ తప్పనిసరి. జిల్లావ్యాప్తంగా సుమారు 2,400 మంది కానిస్టేబుళ్లు సివిల్ డ్యూటీలో ఉన్నారు. గతేడాది ఐదేళ్లు నిండిన సుమారు 380 కానిస్టేబుళ్లను ఒక ఠాణా నుంచి మరో ఠాణాకు పంపించారు. ఈ బదిలీల్లో 250 మందికిపైగా బదిలీలు జరిగే అవకాశామున్నట్లు సమాచారం. జూన్ 2న కొత్త సర్కారు కొలువుదీరిన అనంతరం బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు.

 బదిలీకి ఒక్కో విధానం
 గతంలో ఎస్పీలుగా పనిచేసిన వారు ఒక్కొక్కరు ఒక్కో విధానంలో బదిలీ ప్రక్రియ చేపట్టారు. కొన్ని సార్లు ఆ విధానాలు విమర్శలకు దారితీశాయి. గతంలో ఓ ఎస్పీ ఏబీసీడీ గ్రేడ్‌లుగా విభజించి ఒక గ్రేడ్ నుంచి మరో గ్రేడ్‌కు, ఒక సబ్ డివిజన్ నుంచి మరో సబ్ డివిజన్‌కు తప్పనిసరి బదిలీ చేయాలని చేసిన ప్రయత్నాలపై పోలీసు శాఖలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ విధానాన్ని ఆయనకు వెనక్కు తీసుకున్నారు. ఆ తరువాత వచ్చిన ఎస్పీలు కూడా కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో ఆప్షన్లకు అవకాశమిచ్చి వారికి అనువుగానే బదిలీలు చేపట్టారు. ప్రధానంగా కానిస్టేబుళ్లు తమ సొంత ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్లలో పని చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉంటారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తారు. రాత్రిపగలు అని తేడా లేకుండా పోలీస్ డ్యూటీలో ఉండే కానిస్టేబుళ్లు కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తారు.

 అనువైన చోటే అవకాశం
 ప్రస్తుత ఎస్పీ గజరావు భూపాల్ కౌన్సెలింగ్ విధానంలో ఈ బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో సర్కిల్, సబ్ డివిజన్, గ్రేడ్ అనే విధానాలు కాకుండా కానిస్టేబుల్ తనకు అనువుగా భావించే మూడు పోలీసు స్టేషన్లను ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ ఎంచుకున్న స్టేషన్లలో ఎక్కడ ఖాళీ ఉంటుందో అక్కడకు బదిలీ చేస్తారు. ఈ విధానంపై పోలీసు శాఖలో హార్షం వ్యక్తమవుతోంది. అదే విధంగా పైరవీలకు తావు లేకుండా అందరికీ న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. తనకు కానీ, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలున్న పక్షంలో వారిని పట్టణ ప్రాంతాలు, ఆస్పత్రులు ఉన్నచోటికి బదిలీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ విషయమై ‘న్యూస్‌లైన్’ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్‌ను వివరణ కోరగా.. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లను వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తామని, త్వరలో బదిలీ కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు