తూతూ మంత్రంగా కాంగ్రెస్ ఆత్మావలోకనం | Sakshi
Sakshi News home page

తూతూ మంత్రంగా కాంగ్రెస్ ఆత్మావలోకనం

Published Fri, May 30 2014 2:21 AM

Mantra, and the tutu, unless

  • ముఖ్యమంత్రి సిద్ధు గైర్హాజర్
  •  నేడు నగరానికి దిగ్విజయ్‌సింగ్
  •  సాక్షి, బెంగళూరు : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఆత్మావలోకన సభ తూతూ మంత్రంగా జరిగింది. ఈ సభకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గైర్హాజర్ కావడమే ఇందుకు కారణం. రాష్ర్టంలో అధికారంలో ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో  బీజేపీ కంటే తక్కువ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై చర్చించేందుకు ఆత్మావలోకన సభ పేరిట బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ఓ సభను నిర్వహించింది.

    గత వారమే ఈ సభ జరగాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరిక మేరకు సభను గురువారానికి వాయిదా వేశారు. అయినా ఆయన ఈ సభకు గైర్హాజరు కావడంపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల సీఎంకు పార్టీపై ఎంతటి గౌరవం ఉందో అర్థమవుతోందని వారు విమర్శిస్తున్నారు.

    ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించడంతో పాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించాల్సిన ముఖ్యమైన సమావేశానికి సీఎం గైర్హాజరు కావడం  పార్టీలోని విభేదాలకు నిదర్శంగా నిలిచింది. కాగా, సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో పాటు కొంతమంది జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
     
    నేడు నగరానికి దిగ్విజయ్‌సింగ్

    కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్  శుక్రవారం  నగరానికి రానున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరు వస్తున్న ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, మరికొందరు ముఖ్యనేతలతో కూడా భేటీ కానున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వీరి మధ్య చర్చ జరిగే అవకాాశం ఉంది.

    ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన కొంతమంది అభ్యర్థులు తమ ఓటమికి కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎలా తెరవెనుక మంత్రాంగాన్ని నడిపారన్న విషయంపై తయారు చేసిన నివేదికను దిగ్విజయ్‌సింగ్‌కు ఇవ్వడానికి సమాయత్తమవుతున్నారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. కాగా, లోక్‌సభ ఎన్నికలు వెలువడిన తర్వాత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి.

Advertisement
Advertisement