పంపుసెట్లకు దొంగల బెడద

9 Sep, 2019 10:17 IST|Sakshi
దొంగలు ఫ్యూజ్‌లను ఎత్తుకెళ్లగా ఖాళీగా ఉన్న పంపుసెట్టు విద్యుత్‌ బాక్స్‌

సాక్షి, మోర్తాడ్‌: వరద కాలువకు ఇరువైపుల ఉన్న పంట పొలాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసుకున్న పంపుసెట్లకు దొంగల బెడద ఎక్కువైంది. పంపుసెట్లకు ఉన్న విద్యుత్‌ కనెక్షన్‌లను తొలగిస్తున్న దొంగలు రాగి (కాపర్‌) తీగెలను ఎత్తుకెళుతున్నారు. కమ్మర్‌పల్లి, మోర్తాడ్, వేల్పూర్, ముప్కాల్, బాల్కొండ మండలాల్లోని పలు గ్రామాల మధ్య వరద కాలువను తవ్వారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవనం పథకంలో భాగంగా కాళేశ్వరం నీటిని వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వర్షపు నీరు వరద కాలువలో నిలిచింది. ఆ నీటిని పంట పొలాలకు తరలించేందుకు అనేక మంది రైతులు పంపుసెట్లను ఏర్పాటు చేసుకున్నారు.

పంపుసెట్లకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఉన్న బోర్డులలోని ఫ్యూజ్‌లను దొంగలు తొలగించి విద్యుత్‌ కనెక్షన్‌ను కట్‌ చేస్తున్నారు. విద్యుత్‌ కనెక్షన్‌లలో ఉన్న రాగి తీగలను తొలగించి వాటిని కొన్ని రోజుల నుంచి దొంగలు ఎత్తుకెళుతున్నారు. కాళేశ్వరం నీరు వరద కాలువలో చేరడంతో తాము పండిస్తున్న పసుపు, మొక్కజొన్న, సోయా, వరి పంటలకు సాగునీటిని అందించేందుకు రైతులు సిద్ధం కాగా ఆదివారం కాపర్‌ తీగెల కోసం విద్యుత్‌ కనెక్షన్‌లను తొలగించినట్లు ఆధారాలు లభించాయి. మోర్తాడ్, పాలెం, తిమ్మాపూర్, గాండ్లపేట్, దొన్కల్‌ తదితర గ్రామాలకు చెంది న రైతుల పంపుసెట్ల కనెక్షన్‌లు కట్‌ చేసినట్లు ఉన్నాయి. కాపర్‌ తీగెలు చోరీకి గురి కావడంతో పంట పొలాలకు రైతులు సాగునీటిని అందించేందుకు రైతులు అవస్థలు పడ్డారు.

కొద్ది రోజులుగా ఇలా వరుస చోరీలు జరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఫ్యూజ్‌లను తొలగించి విద్యుత్‌ తీగెలను దొంగలు కట్‌ చేస్తుండటంతో తాము ఆర్థికంగాను నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాగి తీగెలను దొంగిలించే వారిని పట్టుకునేందుకు రైతులు గతంలో గస్తీ తిరిగారు. అయితే వర్షాలు కురుస్తుండటంతో గస్తీని నిలిపివేశారు. అంతలోనే మళ్లీ చోరీలు మొదలయ్యాయి. పోలీసులు స్పందించి వరద కాలువ పరిసరాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా