భౌతిక దూరం కోసం కంటోన్మెంట్‌

14 Apr, 2020 05:07 IST|Sakshi
తిరుమలగిరి కంటోన్మెంట్‌ ప్రాంతం

సికింద్రాబాద్‌ ప్రాంతంలో నిర్మించిన ఆనాటి బ్రిటిష్‌ పాలకులు

సిబ్బందిలో 40 శాతం వ్యాధులతో చనిపోయే వారు

దీని నివారణకు రాయల్‌ శానిటరీ కమిషన్‌

దాని సిఫారసుల్లో కంటోన్మెంట్‌ ఏర్పాటు కీలకం

స్థానికులతో బ్రిటిష్‌ సిబ్బంది దూరంగా మసిలేలా వసతులు

ఆ తర్వాత వారిలో తగ్గిపోయిన వ్యాధుల పీడ

‘భారతీయులు, కుక్కలకు నిషేధం’ఇలా రాసి ఉన్న బోర్డులు కంటోన్మెంట్‌ ప్రాంతంలో విరివిగా కనిపించేవి. ప్రధాన ద్వారం, ఆసుపత్రి, క్లబ్, క్రీడా ప్రాంగణం, ఈత కొలను, చర్చీలు.. ఇలాంటి అన్ని చోట్ల ఈ బోర్డులు ఉండేవి. స్థానికులతో కలిస్తే వ్యాధులు సోకుతాయన్న భయం. తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే స్థానికులతో భౌతిక దూరాన్ని పాటించాలనేది నాటి నిబంధన. తాము పెంచుకున్న కుక్కలు తప్ప, స్థానిక కుక్కలు రాకుండా చూసుకునేవారు. ఇది 1865 సమయంలో రూపుదిద్దుకున్న కంటోన్మెంట్‌ కథ’

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నియంత్రించాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక ‘మందు’భౌతిక దూరం పాటించటమే.. ఇప్పుడు ప్రపంచమంతా అనుసరిస్తున్న విధానం ఇదే. ఈ సూత్రం తెలియకపోవటం వల్లే వందేళ్ల కింద స్పానిష్‌ ఇన్‌ఫ్లుయెంజా విసిరిన పంజాకు మన దేశంలో ఏకంగా కోటిన్నర కంటే ఎక్కువ మంది చనిపోయారు. మన దేశంలో అన్ని మరణాలు సంభవించినా.. ఇక్కడ పాలనా పగ్గాలు పట్టుకుని ఉన్న బ్రిటిష్‌ వాళ్లు మాత్రం అంత ఎక్కువ సంఖ్యలో చనిపోలేదు. దానికి కారణం.. భౌతిక దూరాన్ని పాటించటమే.

సిఫారసులు ఇలా..
► భారత్‌లో విధులు నిర్వర్తిస్తున్న బ్రిటిష్‌ సిబ్బంది, స్థానిక భారతీయులతో మెసలకుండా ప్రత్యేకంగా నివాసం ఉండాలి.
► స్థానికుల ద్వారా వారికి అంటువ్యాధులు సోకుతున్నాయి. అవి వారి మరణానికి కారణమవుతున్నాయి. 
► బ్రిటిష్‌ సిబ్బందికి విశాలమైన ప్రాంతంలో దూరం దూరంగా ఉండేలా కార్యాలయాలు, నివాస సముదాయాలు నిర్మించాలి. 
► వారికి శుద్ధి చేసిన నీరు అందించాలి. మంచి భవనాలు నిర్మించాలి. నీరు నిలిచిపోని విధంగా డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి. ఈగలు, దోమలు లేకుండా చూడాలి. 
► ఆ ప్రాంగణాల్లోకి భారతీయులను అనుమతించొద్దు. 
సికింద్రాబాద్‌ క్లబ్‌ 

కంటోన్మెంట్‌ అందుకే..
సికింద్రాబాద్‌లో ఉన్న కంటోన్మెంట్‌ ప్రాంతం.. ఈ భౌతిక దూరం సూత్రంపైనే రూపుదిద్దుకుంది. ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో చరిత్రకారులు నాటి బ్రిటిష్‌ వారి దూరాలోచనను గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో కంటోన్మెంట్‌ ప్రాంతాలున్నాయి. ఇవన్నీ నాటి ఆంగ్లేయులు నిర్మించినవే. అన్నింటి ఉద్దేశం ఒకటే. స్థానిక భారతీయులతో ‘సామాజిక’దూరాన్ని పాటించటం. 

40 శాతం మంది చనిపోతుండటంతో..
ఇది 1850 నాటి సంగతి.. మన దేశంలో పాలన కోసం 10 వేల మంది బ్రిటిష్‌ సిబ్బంది ఉండేవారు. వీరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించేవారు. కానీ వీరిలో ఏకంగా 40 శాతం మంది అంటురోగాలు, ఇతర వ్యాధులతో చనిపోయేవారు. మూడింట ఒక వంతు మంది వ్యాధులతో ఎప్పుడూ చికిత్స పొందుతుండేవారు. ఐదారేళ్లు కాగానే 30 శాతం మంది సిబ్బందే మిగిలేవారు. దీంతో ఎప్పటికప్పుడు కావాల్సినంత మందిని ఇంగ్లండ్‌ నుంచి రప్పించాల్సి వచ్చేది. ఇది ఆ దేశాన్ని తీవ్రంగా కలవరపరిచింది. దీంతో దీనికి కారణాలు కనుక్కుంటూ పరిష్కారాలు చూపాల్సిందిగా ఆదేశిస్తూ ఆ దేశం రాయల్‌ శానిటరీ కమిషన్‌ను నియమించింది. 1863 ప్రాంతంలో ఈ కమిషన్‌ నివేదిక సమర్పించింది. 

వెంటనే కంటోన్మెంట్‌ నిర్మాణం
హైదరాబాద్‌ ప్రాంతం నిజాం కేంద్రంగా ఉండగా, సికింద్రాబాద్‌ ప్రాంతాన్ని బ్రిటిషర్స్‌ తమకు వీలుగా వాడుకునేవారు. అందుకే సికింద్రాబాద్‌లో ప్రత్యేకంగా కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని నిర్మించుకున్నారు. వేల ఎకరాల సువిశాల ప్రాంతంలో వారికి కార్యాలయాలు, నివాసాలు, రీక్రియేషన్‌ కేంద్రాలు, ఆట మైదానాలు, చర్చీలు, ఉద్యానవనాలు వెలిశాయి. అవన్నీ భౌతిక దూరం పద్ధతిలో దూరం దూరంగా నిర్మించారు. కంటోన్మెంట్‌ నిర్మాణం తర్వాత బ్రిటిష్‌ సిబ్బందిలో మరణాల రేటు తగ్గిపోయింది. వారికి ప్రత్యేకంగా మంచినీటి వసతి ఉండటం, నిరంతరం పారేలా మురుగునీటి వ్యవస్థ ఏర్పడటం, మానసిక శారీరక ఉల్లాసానికి ఏర్పాట్లు ఉండటం, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడటం, మంచి వైద్య సేవలు అందుబాటులో ఉండటం, రోగాలతో బాధపడే స్థానికులకు దూరంగా ఉండటం వెరసి వారి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కనిపించింది. ‘1918లో ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టించిన స్పానిష్‌ ఇన్‌ఫ్లుయెంజా ప్రభావం మన దేశంలోని కంటోన్మెంట్‌లలో భద్రంగా ఉన్న బ్రిటిష్‌వారిపై అంతగా ప్రభావం చూపలేదు. ఆ వ్యాధి సోకిన భారతీయులతో వారు భౌతిక దూరాన్ని పాటించడమే దీనికి కారణం. అందుకు కంటోన్మెంట్‌ ఉపయోగపడింది’అని చరిత్ర పరిశోధకులు డాక్టర్‌ రాజారెడ్డి పేర్కొన్నారు. 

అప్పట్లోనే 500 పడకలతో ఆసుపత్రి
కంటోన్మెంట్‌ ప్రాంతంలో 1870 నాటికి కంబైండ్‌ మిలిటరీ హాస్పిటల్‌ను నిర్మించారు. దీన్ని 1920 నాటికి 500 పడకల స్థాయికి పెంచారు. ఇందులో బ్రిటిష్‌ నుంచి ఎప్పుడూ నైపుణ్యం ఉన్న వైద్యులు, నర్సులను కావాల్సినంత మందిని ఉంచేవారు. దీంతో ఏ చిన్న సమస్య వచ్చినా, బ్రిటిష్‌ వారికి వెంటనే నాణ్యమైన వైద్యం అందేది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ క్లబ్‌గా వాడుకుంటున్న క్లబ్‌ను అప్పట్లో బ్రిటిష్‌ వారి కోసమే వినియోగించేవారు. జింఖానా క్రికెట్‌ మైదానం ఉన్న చోట వారికి క్రీడా సదుపాయాలుండేవి. 

మరిన్ని వార్తలు