తెలంగాణలో కొత్తగా 1087 కరోనా కేసులు

27 Jun, 2020 22:33 IST|Sakshi

ఆరుగురు మృతి.. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. తొలిసారి పాజిటివ్‌ కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1,087 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపితే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,436కు చేరుకుంది. ఇం దులో 8,265 మంది వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌ పద్ధతుల్లో చికిత్స పొందుతుండగా మరో 4,928 మంది కోలుకున్నారు.

మరోవైపు కరోనా ప్రభావంతో శనివారం ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు వైరస్‌ బారినపడి మరణించిన వారి సంఖ్య 243కి చేరింది. శనివారం రాష్ట్రంలో 3,923 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 27.7 శాతం కేసులు పాజిటివ్‌గా నమోదు కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 79,231 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 16.95 శాతం మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.

‘గ్రేటర్‌’లో 888 పాజిటివ్‌ కేసులు
శనివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 888 మంది కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 74, మేడ్చల్‌ జిల్లాలో 37, నల్లగొండ జిల్లాలో 35, సంగారెడ్డి జిల్లాలో 11, వరంగల్‌ అర్బన్‌లో 7, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఐదు చొప్పున, జనగామ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో నాలుగు చొప్పున, సిరిసిల్లలో 3, సిద్దిపేట, కొత్తగూడెం జిల్లాల్లో రెండు చొప్పున, ఆసిఫాబాద్, ఖమ్మం, వనపర్తి, మహబుబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.

ఇంటర్‌ బోర్డులో మరో నలుగురికి..
ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో ఇటీవల ఇద్దరు సీనియర్‌ అధికారులకు కరోనా పాజిటివ్‌ రాగా, శనివారం మరో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. పరీక్షల నియంత్రణాధికారితోపాటు ఆయన డ్రైవర్, మరో ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. అంతకుముందు మరో ఇద్దరు అధికారులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇంటర్‌ బోర్డు కార్యాలయం పూర్తిగా ఆంక్షలు విధించింది. విజిటర్స్‌ ఎవర్నీ బోర్డు కార్యాలయంలోపలికి అనుమతించడం లేదు. మరోవైపు బోర్డు కార్యాలయంలో శానిటైజేషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలోనూ ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది.

నల్లగొండలో 14 మంది పోలీసులకు..
నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లాలో 14 మంది పోలీసులకు శనివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో జిల్లా పోలీస్‌ శాఖలో కలవరం నెలకొంది. వీరు ఎస్పీ కార్యాలయం, నల్లగొండ వన్‌టౌన్, టూటౌన్, బెటాలియన్‌లలో పనిచేస్తున్నట్టు సమాచారం. అలాగే జిల్లా ఎస్పీ రంగనాథ్‌ హోం కార్వంటైన్‌లోకి వెళ్లినట్లు తెలిసింది.

అమీర్‌పేట తహసీల్దార్‌కు కరోనా
అమీర్‌పేట: హైదరాబాద్‌లో అమీర్‌పేట తహసీల్దార్‌ చంద్రకళ కరోనా బారినపడ్డారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనాగా నిర్ధారణ అయ్యింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అమీర్‌పేట కార్యాలయాన్ని శనివారం మూసేసి సిబ్బందిని హోం క్వారంటైన్‌కు పంపారు. చం ద్రకళ షేక్‌పేట తహసీల్దార్‌గా, ప్రకృతి చికిత్సాలయంలోని క్వారంటైన్‌ కేంద్రం నిర్వహణ పనులనూ పర్యవేక్షించడంతో ఆమెను ఎవరెవరు కలిశారన్న వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

అమీర్‌పేటలో 11 మందికి పాజిటివ్‌
మీర్‌పేటలో శనివారం 11 కరోనా పాజిటివ్‌ కేసు లు నమోదైనట్లు కమిషనర్‌ బి. సుమన్‌రావు తెలి పారు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో నలుగురు కాని స్టేబుళ్లు, ఇంటెలిజెన్స్‌ అధికారి, బాలాపూర్‌ మం డల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ స్టాఫ్‌ నర్సు, ముగ్గురు ఆశా వర్కర్లతోపాటు లెనిన్‌నగర్‌ ప్రాంతంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. వారందరినీ వెం టనే హోం క్వారంటైన్‌ చేసినట్లు చెప్పారు. మీర్‌పేటలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ స్టాఫ్‌నర్సు, ముగ్గురు ఆశా వర్కర్లు వైరస్‌ బారిన పడటంతో స్టాఫ్‌ అందరినీ హోం క్వారంటైన్‌కు పంపినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ఉమాదేవి తెలిపారు. ఐదు రోజులపాటు పీహెచ్‌సీలో ఓపీ సేవలు నిలిపివేస్తున్నామని, ప్రజలు ఎవరూ ఆసుపత్రికి రావొద్దని ఆమె కోరారు. 

ఆసిఫ్‌నగర్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌కు..
విజయనగర్‌కాలనీ: ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. గతంలో 19 మంది పోలీసులకు కరో నా సోకగా ఇప్పటివరకు 20 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. ఆసిఫ్‌నగర్‌ పీఎస్‌ పరిధి లో ఇప్పటివరకు 199 మందికి కరోనా వ్యాధి సోకినట్లు ఎస్సై రావిరాల శ్రీనయ్య తెలిపారు. 

>
మరిన్ని వార్తలు