‘రుణా’యస్వాహా!

28 Feb, 2019 08:10 IST|Sakshi

పక్కదారి పడుతున్న ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు

సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అందించాల్సిన రుణాలు పక్కదారి పడుతున్నాయి. స్వయం ఉపాధి కల్పన కోసం అర్హులైన ఎస్సీలకు దక్కాల్సిన రుణాలను కొందరు అడ్డదారిలో చేజిక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కొందరు బ్యాంకు అధికారులు, మరికొందరు సంబంధిత ఉద్యోగుల సహకారం ఉందనే వ్యవహారం పత్రికల ద్వారా వెలుగుచూడడంతో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. సబ్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతిని విచారణ అధికారిగా నియమించడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది.  2015–16లో ఎస్సీ కార్పొరేషన్‌లో దరఖాస్తుదారులకు స్వయం ఉపాధి పేరుతో మంజూరైన రుణాల్లో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగనున్నది. అనేకచోట్ల యూనిట్లు స్థాపించకుండానే, పలువురు లబ్ధిదారులకు తెలియకుండానే వారి పేరుతో బ్యాంకు చెక్కులు జారీ కావడం, అవి దళారుల అకౌంట్‌లో జమ కావడం వంటి అంశాలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఎస్సీ కార్పొరేషన్‌ మంజూరు చేసిన స్వయం ఉపాధి పథకం యూనిట్లలో బ్యాంకులు లబ్ధిదారులకు యూనిట్‌ నెలకొల్పేందుకు అందజేసిన ప్రకారం సదరు యూనిట్‌కు సంబంధించిన వ్యాపార వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు చెక్కు జారీ చేస్తుంది.

అయితే ఇందులో అనేకచోట్ల ఉత్తుత్తి కొటేషన్‌ చెక్కులు జారీ అయినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చడం.. అసలు యూనిట్లు నెలకొల్పకుండానే కాజేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఉదా.. టెంట్‌హౌస్‌ కావాలని కోరిన లబ్ధిదారుడికి ఎస్సీ కార్పొరేషన్‌ ఆ రుణానికి లబ్ధిదారుడిని ఎంపిక చేసి మంజూరు చేస్తే.. దీనికి సంబంధించిన రుణం బ్యాంకుల ద్వారా అందజేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి 10 శాతం నిధులను లబ్ధిదారుడు బ్యాంకులో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఆ నిధులు తమ ఖాతాలో జమ చేశాక.. కార్పొరేషన్‌ మంజూరు చేసిన యూనిట్‌ ప్రకారం మిగిలిన 90 శాతం నిధులను బ్యాంకు సదరు లబ్ధిదారుడు కోరుకున్న వ్యాపారానికి సంబంధించి జారీ చేసిన కొటేషన్‌దారుడికి చెక్కు జారీ చేస్తారు. అయితే సదరు కొటేషన్‌దారుడికి చెక్కులు జారీ అయితే అయ్యాయి కానీ.. నెలలు గడిచినా యూనిట్లు నెలకొల్పకపోవడం.. అవి నెలకొల్పారా.. లేదా.. అనే అంశంపై సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.  

నిలువెత్తు నిర్లక్ష్యం.. 
లబ్ధిదారులకు రుణాలు మంజూరై నెలలు గడుస్తున్నా.. సదరు అధికారులు ఈ వ్యవహారంపై కన్నెత్తి చూడకపోవడం.. ఒక్కచోట అయినా యూనిట్‌ లేదని గుర్తించకపోవడం నిలువెత్తు నిర్లక్ష్యానికి అద్దం పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. యూనిట్ల స్థాపన లేకుండానే లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడం, లబ్ధి పొందకుండానే తమకు నోటీసులు జారీ కావడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేయడంతో రుణాల మాయాజాలం వెలుగు చూసింది. దీనిపై ఖమ్మం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ప్రభుత్వ రుణాల్లో దళారీగా వ్యవహరించి.. లబ్ధిదారుల సొమ్ము కాజేశారనే కారణంతో వేముల సునీల్, మరికొందరి పాత్రపై విచారణ చేయాల్సిందిగా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ కార్పొరేషన్‌లో రుణాల పేరుతో జరిగిన మాయాజాలం ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే ఆందోళన ఇటు దళారుల్లో.. అటు కార్పొరేషన్‌ ఉద్యోగుల్లోనూ నెలకొంది.

గతంలో జరిగిన ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల మంజూరు, యూనిట్ల ఏర్పాటు అంశాలపై సైతం అధికారులు దృష్టి సారించి.. ఇప్పటివరకు మంజూరైన వివిధ రకాల యూనిట్లు, అవి మంజూరు చేసిన స్థానాల్లో ఉన్నాయా? లేదా? వాటికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరు? ఈ యూనిట్లు చేతులు మారాయా? యూనిట్లు లేకుండానే రుణం మంజూరైందా? అది ఏయే సంవత్సరాల్లో జరిగిందనే విషయంపై లోతైన విచారణ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇదే విషయంపై నిఘా వర్గాలు సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల మంజూరులో దళారుల పాత్ర, అధికారుల ప్రమేయం, పలు బ్యాంకుల పాత్రపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏడాదిలో ఎస్సీ కార్పొరేషన్‌ మంజూరు చేసిన రుణాల్లోనే ఇంత భారీస్థాయిలో అవినీతి జరిగితే.. మిగిలిన అంశాల్లో ఎంత జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

అసలేం జరిగిందంటే.. 
2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు పొందేందుకు సుమారు 15వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం జిల్లాకు 1,500 యూనిట్ల లక్ష్యాన్ని నిర్ణయించగా.. అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసే చర్యలు చేపట్టారు. ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో 219 యూనిట్లకు లక్ష్యాన్ని నిర్దేశించి.. మిగిలిన మండలాలకు, మున్సిపాలిటీలలో 1,300 యూనిట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే నాడు ఖమ్మం మున్సిపాలిటీ అధికారులు మినహా ఎంపీడీఓలు, ఇతర మున్సిపాలిటీల అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాల మంజూరుకు నివేదికలు పంపించారు. దీంతో ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు ఖమ్మం కార్పొరేషన్‌ దరఖాస్తుదారులను మినహాయించి మిగిలిన మండల, మున్సిపాలిటీలకు సబ్సిడీ నిధులను మంజూరు చేశారు. దీంతో ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో కొందరు లబ్ధిదారుల తరఫున దళారీ కోర్టును ఆశ్రయించారు. తమకు రుణాలు ఇప్పించాలని, అధికారుల నిర్లక్ష్యంతో చేతికొచ్చిన రుణాలను కోల్పోతున్నామని లబ్ధిదారుల తరఫున కోర్టులో వాదనలు వినిపించడంతో 201 మందికి రుణాలు మంజూరు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

201 మందిలో 180 మంది మాత్రమే బ్యాంకు అకౌంట్లు అధికారులకు సమర్పించడంతో వారికి మాత్రమే రుణాలు మంజూరు చేసింది. వీరికి  రూ.7.99కోట్లు మంజూరు చేయగా.. వాటిలో రూ.4.75కోట్లు ప్రభుత్వం అందించే సబ్సిడీ కాగా.. రూ.3.72కోట్లు బ్యాంకర్ల నుంచి రుణంగా అందుతుంది. అయితే రుణాల మంజూరు సమయంలో కొందరు లబ్ధిదారులు దళారీని ఆశ్రయించగా.. అతడు రుణం మంజూరయ్యేందుకు సహకరించాడు. లబ్ధిదారులు చేయాల్సిన వ్యాపారానికి సంబంధించి కొటేషన్లు ఒకే వ్యక్తి పేరుతో జారీ అయినా.. ఆయన ఏ వ్యాపారం చేస్తారనే అంశంపై రుణం మంజూరు చేసిన అధికారులు కానీ.. బ్యాంకులు కానీ పట్టించుకోకపోవడంతో అన్ని వ్యాపారాలకు సంబంధించి ఒకే వ్యక్తి కొటేషన్లు జారీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులకు సంబంధించిన పత్రాలను దళారులు సృష్టించి యూనిట్ల రుణాలు పొందారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారుల యూనిట్‌కు సంబంధించిన యూసీలు పంపించాలని బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతో తమకు రుణాలే రాలేదని, యూనిట్లు ఎక్కడ పెట్టాలంటూ లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులను ఆశ్రయించారు. అయితే దీనిపై సమగ్ర విచారణ జరిగితేగానీ నిజాలు నిగ్గు తేలనున్నాయి.

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సస్పెన్షన్‌ 
ఖమ్మం మయూరిసెంటర్‌: ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వై.ప్రభాకర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆ శాఖ ఎండీ లచ్చీరాం భూక్యా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌లో 2015–16 సబ్సిడీ రుణాలకు ఎంపికైన లబ్ధిదారులకు అందజేయాల్సిన రుణాల అక్రమాల నేపథ్యంలో ఆయనను సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రభాకర్‌ స్థానంలో ఎవరిని నియమించేది త్వరలో తేలనున్నది. 

మరిన్ని వార్తలు