పడకేసిన సంయుక్త ప్రాజెక్టులు 

1 Feb, 2020 03:28 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వట్లేదంటూ రైల్వే బోర్డుకు జీఎం లేఖ 

బడ్జెట్‌ కేటాయింపులపై ప్రభావం ఉంటుందేమోనన్న అనుమానం 

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి సంయుక్తంగా చేపట్టాలన్న నిర్ణయం వికటిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే మధ్య సమన్వయం కొరవడి పనులు పడకేస్తున్నాయి. తీవ్ర విభేదాలు నెలకొని మిగతా ప్రాజెక్టులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. పనుల్లో జాప్యం కారణంగా ప్రాజెక్టుల అంచనా విలువ పెరిగి ఖజానాపై భారాన్ని పెంచుతోంది. కనీసం రెండు వైపుల సమన్వయం కోసం సమావేశాలు కూడా ఏర్పాటు కావట్లేదు. సమస్యకు కారణం మీరంటే మీరని లేఖల యుద్ధం నడుస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వట్లేదంటూ రైల్వే బోర్డుకు జీఎం లేఖ రాశారు. అయితే ఈ వ్యవహారం.. ఆయా ప్రాజెక్టులకు ఈసారి బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయటంలో పడుతుందని అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొత్త సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఇటీవల రైల్వే జీఎం గజానన్‌ మాల్యా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదల అంశాన్ని ప్రస్తావించారు. కానీ తర్వాత ఏ భేటీ జరగలేదు. కాగా, రాష్ట్రప్రభుత్వం నుంచి నిధులు రాక పనులు చేపట్టలేకపోతున్నామని రైల్వే జీఎం రైల్వే బోర్డు చైర్మన్‌ దృష్టికి తెచి్చన నేపథ్యంలో.. బడ్జెట్‌ కేటాయింపులు సంతృప్తిగా ఉంటాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 రాయగిరికి వెళ్లేనా..? 
ఘట్కేసర్‌–యాదాద్రి (రాయగిరి) ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టు పేరు వినగానే హైదరాబాద్‌ శివారు వాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కానీ అది ప్రకటనకే పరిమితమైంది. దీన్ని రాష్ట్రప్రభుత్వ సహకారంతో రైల్వే చేపట్టింది. మూడో వంతు నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. కానీ సమన్వయం పూర్తిగా కొరవడింది. దీనికి రాష్ట్రప్రభుత్వం నుంచి నిధులు రాకపోవటంతో ఇప్పటి వరకు రైల్వే ఆ పనులు ప్రారంభించలేదు. ప్రస్తుతం ఉన్న ఎంఎంటీఎస్‌ సేవలు పరిమితంగా మారిపోయాయి. సగటున కేవలం 1.6 లక్షల మంది మాత్రమే నిత్యం ఆ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. కానీ ఆ రైళ్లకు మంచి డిమాండ్‌ ఉంది. దీంతో వాటిని సేవలను విస్తరించేందుకు ఏడేళ్ల క్రితం రెండో దశకు శ్రీకారం చుట్టారు. కానీ పనులు ముందుకు సాగట్లేదు. ఖర్చులో మూడో వంతు నిధులు మాత్రమే భరించాల్సిన రైల్వే.. అంతకంటే ఎక్కువే ఖర్చు చేసింది.

 కలల ప్రాజెక్టు పరిస్థితీ అంతే.. 
కరీంనగర్‌ను హైదరాబాద్‌తో రైల్వే మార్గం ద్వారా అనుసంధానించే మనోహరాబాద్‌–కొత్తపల్లి ప్రాజెక్టు విషయంలోనూ రైల్వే–రాష్ట్రప్రభుత్వం మధ్య పేచీ నెలకొంది. ఈ ప్రాజెక్టు కోసం యావత్తు తెలంగాణ రెండు దశాబాద్దాలుగా ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు పట్టాలెక్కిన దీన్ని పరుగుపెట్టించటంలో మాత్రం రైల్వే విఫలమవుతోంది. రూ.1,160 కోట్ల అంచనాతో ప్రారంభమైన పనులు పడకేశాయి. మనోహరాబాద్‌–గజ్వేల్‌ మధ్య 32 కి.మీ. మేర మాత్రం దాదాపు ఏడాది ఆలస్యంగా పనులు తుది దశకు చేరుకున్నాయి. మిగతా చోట్ల భూసేకరణ వద్దే నిలిచిపోయాయి. దీనికి రాష్ట్రప్రభుత్వం మూడో వంతు నిధులివ్వాలి. భూసేకరణ ఖర్చు భరించాలి. కానీ నిధులు ఇవ్వక భారం రైల్వేపై పడుతోందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. 

బొగ్గు రవాణాకు కీలకం.. 
బొగ్గు రవాణాకు అత్యంత కీలకం కానున్న భద్రాచలం–సత్తుపల్లి రైల్వే ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే సమస్య నెలకొంది. రూ.704 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రైల్వే రెండేళ్లక్రితమే పచ్చజెండా ఊపింది. భూసేకరణ భారాన్ని రైల్వే భరించనుండగా, ప్రాజెక్టు ఖర్చును రాష్ట్రప్రభుత్వం పక్షాన సింగరేణి సంస్థ భరించాల్సి ఉంది. తమకు నిధులు అందలేదని చెబుతూ రైల్వే శాఖ పనులు చేపట్టలేదు. ఫలితంగా పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇది ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచబోతోంది. అసలు పనే మొదలు కాకుండా ఏకంగా రూ.200 కోట్ల మేర ఖర్చును పెంచుతూ కొత్త అంచనా వ్యయాన్ని ప్రకటించేందుకు రైల్వే సిద్ధమైంది. గత బడ్జెట్‌లో రూ.405 కోట్లు భూసేకరణకు కేటాయించింది. కానీ పనులు మాత్రం మొదలు కాలేదు. రాష్ట్రప్రభుత్వ పక్షాన నిధులు రానందున ఈ బడ్జెట్‌పై దాని ప్రభావం ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది.

చివరికొచ్చాక తప్పని జాప్యం.. 
కొన్నేళ్లుగా సాగుతున్న ప్రాజెక్టు మెదక్‌–అక్కన్నపేట రైలు మార్గం. దీనికి రైల్వే తన వంతు వాటా నిధులు విడుదల చేసి పనులను చివరి దశకు చేర్చింది. కానీ రాష్ట్రప్రభుత్వం తన వంతు వాటా నిధులు ఇవ్వట్లేదని ఇప్పుడు కినుక వహించింది. గత బడ్జెట్‌లో రూ.10 లక్షలు మాత్రమే కేటాయించింది. ఈసారి కూడా అలాగే వ్యవహరిస్తే, తుది దశలో ఉన్న ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యేందుకు మరింత జాప్యం తప్పదు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు