ఖరీఫ్‌సాగు ప్రశ్నార్థకమేనా?

20 Jun, 2019 13:13 IST|Sakshi
బోరుబావుల నుంచి కుంటలో నింపుతున్న నీరు

వర్షా కాలం ప్రారంభమైనా కరుణించని వరుణుడు

నెలరోజుల ఆలస్యంపై  రైతుల ఆందోళన 

సాక్షి, ధరూరు: వరుణుడి కరుణ కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. వాస్తవానికి మే నెలాఖరు లేదా జూన్‌ మొదటివారంలోనే ఏటా సమృద్ధిగా వర్షాలు కురిసి ఈపాటికే నెలరోజుల పంట సాగయ్యేది. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఒక్క ఎకరంలో కూడా పంటసాగును చేయలేకపోయారు. ఇప్పటికే పంటపొలాలను దున్నుకొని సిద్ధం చేసుకున్న రైతులు ఎరువులు, విత్తనాలను సిద్ధం చేసుకొని వరుణదేవుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు.

ఊరిస్తున్న మబ్బులు..
ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో తేలికపాటి జల్లులు కురుస్తూ రైతులను ఊరిస్తున్నాయి. ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నిత్యం నిరాశే ఎదురవుతుంది. ఆరుతడి పంటలతో పాటు మెట్టపంటల సాగును చేసుకునేందుకు రైతులు ఎదురుచూస్తున్నారు. ఒక్క భారీ వర్షం కూడా కురవకపోవడంతో ఎటు చూసినా వ్యవసాయ పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. ఏ రైతును కదిలించినా దీనగాథలే బయటకు వస్తున్నాయి. 

అడుగంటుతున్న భూగర్భ జలాలు..
భూగర్భ జలాలు కూడా రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. బోరుబావుల్లో నుంచి నెలరోజుల క్రితం వరకు రెండు ఈంచుల నీళ్లు వచ్చే బోర్లు, ఒక్క నెలరోజుల వ్యవధిలోనే ఈంచు, అర ఈంచుకు తగ్గిపోయాయి. దీంతో పంటలను సాగు చేసుకునేందుకు బోరుబావులు ఉన్న రైతులు కూడా ముందుకు రావడం లేదు. ధైర్యం చేసి కొంతమంది రైతులు సీడ్‌పత్తి పంటను సాగు చేసుకున్నారు. బోర్లలో రోజురోజుకు నీళ్లు తగ్గుముఖం పడుతుండటంతో వేలాది రూపాయలు ఖర్చుపెట్టి సాగుచేసిన పత్తి పంటపై కూడా రైతులకు ఆశలు సన్నగిల్లుతున్నాయి.

ప్రస్తుతం వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవసరమయ్యే సబ్సిడీ ఎరువులు, విత్తనాలను కూడా అందుబాటులోకి తేలేదు. మరో పది పదిహేను రోజులు ఇదే గడ్డు పరిస్థితి ఉంటే ఖరీఫ్‌ పంటసాగు లేనట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని కర్ణాటక, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవకపోవడంతో జూరాలకు సైతం నీళ్లు రాలేదు. ప్రాజెక్టుకైనా నీళ్లు వచ్చి ఉంటే నెట్టెంపాడు ఎత్తిపోతల పంపుల ద్వారా రిజర్వాయర్లను నింపి కాస్తో, కూస్తో పంటలను సాగు చేసుకునే వారమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో తమ పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా తయారైందని వాపోతున్నారు.
 

మరిన్ని వార్తలు