పుస్పూర్‌లో రైతుల రాస్తారోకో

4 May, 2018 10:28 IST|Sakshi
రాస్తారోకో చేస్తున్న రైతులు

లోకేశ్వరం(ముథోల్‌) : రైతుల వద్ద కొనుగోలు చేసిన మొక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రం నుంచి తరలించాలని డిమాండ్‌ చేస్తూ.. రైతులు గురువారం మండలంలోని పుస్పూర్‌ గ్రామ భైంసా–లోకేశ్వరం రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా గంటపాటు వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయమేర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మండలంలోని పుస్పూర్‌ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు ఉపకేంద్రంలో తాము మొక్కజొన్న పంటను విక్రయించామని తెలిపారు.

నెల రోజులుగా తమ వద్ద కొనుగోలు చేసిన మక్కలు తరలించకుండా కేంద్రంలోనే నిల్వ ఉంచుతున్నారని వాపోయారు. ఈ విషయమై అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడంలేదన్నారు. పంట తడిచినా.. తూకం తగ్గినా ధరలో కోత విధించనున్నందున వెంటనే కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములకు తరలించాలని డిమాండ్‌ చేశారు.

విషయం తెలుసుకున్న పీఏసీఎస్‌ చైర్మన్‌ చిన్నారావు, ఎస్సై రమేశ్‌ పుస్పూర్‌ గ్రామానికి చేరుకున్నారు. రెండుమూడు రోజుల్లో కొనుగోలు చేసిన మక్కలను లారీల ద్వారా గోదాంలకు తలిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

మరిన్ని వార్తలు