బూజే అని వదిలేస్తే..

20 Jun, 2019 08:14 IST|Sakshi

పెద్దల్లో కాలేయ కేన్సర్‌ పిల్లల్లో మరుగుజ్జుతనం..

పశువుల పాలు విషతుల్యం

జాగ్రత్తగా ఉండాలంటున్న శాస్త్రవేత్తలు

నివారణపై ఎన్‌ఐఎన్‌ అధ్యయనం

తార్నాకలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

తార్నాక: ఇంట్లో పల్లీలు ఉడకబెట్టి తినడం మరిచిపోతే ఏమవుతుంది..? ఒకరోజు గడిస్తే తేమ వల్ల వాటిపై ‘బూజు’ పేరుకుపోతుంది.. బూజే కదా అని తేలిగ్గా తీసుకుని పల్లీలు తినేస్తాం. ఏ పార్కుకో వెళ్లినప్పుడు అక్కడ మొక్కజొన్న కంకులు కనిపిస్తాయి.. అవి ఎప్పటివో కూడా తెలుసుకోకుండా కొనేస్తాం. ఇలాంటి చోట్ల ముందురోజు ఉడకబెట్టి అమ్మగామిగిలిపోయినవి కూడా మరుసటి రోజు అమ్మేస్తుంటారు. ఎవరూ పెద్దగా పట్టించుకోని ఈ ‘బూజు’.. మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందంటున్నారు పోషకాహార శాస్త్రవేత్తలు. తేమతో ఉన్న పల్లీల నుంచి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై కంటికి కనిపించనంత పల్చగా పేరుకునే ఈ బూజు శరీరంలోకి ప్రవేశిస్తే పెద్దవారిలో కాలేయ కేన్సర్, పిల్లల్లో పోషకాహార లోపంతో పాటు పెరుగుదల ఆగిపోయి మరుగుజ్జుతనం వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆహార  ధాన్యాలలోని బూజుతో ప్రమాదకరమైన ఆఫ్లాటాక్సిన్, మైకోటాక్సిన్, డై ఆక్సివాలిన్‌ వంటి విష రసాయనాలు తయారవుతాయని, అలాంటి ఆహారం తింటే మనుషులు, జంతువులు తీవ్ర అనారోగ్యం పాలవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.  

రైతులు పంటలను కోసిన తర్వాత వాటిలో తేమ ఆరిపోయే వరకు ఎండబెట్టకుంటే ఆ గింజల్లో మన కంటికి కనిపించని బూజు ఏర్పడుతుంది. ఈ ఫంగస్‌కు అనేక రకాల రసాయనాలు చేరి వాటిని విషతుల్యం చేస్తాయి. దీం తో దాన్ని తిన్న జీవుల ఆరోగ్యంపై  తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా మొక్కజొన్న, గోధుమ, వేరుశనగ, ఉప్పుడు బియ్యం వంటి వాటిలో ఈ ప్రభావం అధికంగా ఉంటుంది.

ఈ ఫంగస్‌ మనదేశానికిఎలా వచ్చిందంటే..  
కోళ్ల పరిశ్రమలకు ఇంగ్లాండ్‌ పెట్టింది పేరు. అక్కడి ఫామ్‌లలో పెరుగుతున్ను కోళ్లకు బ్రెజిల్‌ నుంచి వేరుశనగ పిండిని దాణాగా తెప్పించే వారు. 1960లో బ్రెజిల్‌ నుంచి తెచ్చిన పల్లీ పిండి తిన్న లక్ష కోళ్లు చనిపోయాయి. అప్పట్లో దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు పల్లీపిండిలో ఏర్పడిన బూజు వల్లే మైకోటాక్సిన్‌ అనే విష రసాయనం చేరి అది కోళ్ల చావుకు కారణమైందని తేల్చారు. అదే సమయంలో మన దేశానికి కూడా బ్రెజిల్‌ నుంచి వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాలు దిగుమతి అయ్యాయి. వాటితోపాటే ఈ బూజు ఫంగస్‌ కూడా మనదేశానికి అంటుకుంది. అయితే దీని జన్మస్థానం మాత్రం ఆఫ్రికా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆల్ఫా టాక్సిన్‌తో కాలేయ కేన్సర్‌
వేరుశనగ, మొక్కజొన్నలోని బూజుతో ఆల్ఫాటాక్సిన్‌ అనే విషపదార్థం ఏర్పడుతుందని, దీంతో ఐదేళ్లలోపు పిల్లల్లో పెరుగుదల నిలిచిపోయి మరుగుజ్జుతనం వస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. పెద్దవారిలో కాలేయ కేన్సర్‌ తప్పదంటున్నారు. ఆల్ఫాటాక్సిన్‌ అధికంగా ఉన్న మొక్కజొన్నలు తిని గతంలో గుజరాత్‌లో వంద మంది గిరిజనులు చనిపోయారు కూడా. అనంతపూర్‌ జిల్లాలోని  పలు ప్రాంతాల్లో పల్లీలను ఆహారంలో అధికంగా  వినియోగిస్తున్నందున వారిలో ఆల్ఫాటాక్సిన్‌ వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీసిందంటున్నారు. అలాగే ఉప్పుడు బియ్యం తిన్నవారిలో ఆల్ఫాటాక్సిన్‌–బీ1 రసాయనాలు, ఈ బియ్యాన్ని మేతగా తిన్న పశువుల పాలలో ఆల్ఫాటాక్సిన్‌ ఎం–1 అనే విష పదార్థాలు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఫ్యూమినోసిన్‌తోనూ డేంజరే..
తడిసిన జొన్నల్లో ‘ఫిజీరియన్‌’ అనే బూజుతో ఫ్యూమినోసిన్‌ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఆయా వ్యక్తులకు కేన్సర్‌ సోకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  
1995లో రంగారెడ్డి జిల్లాలోని పలు గిరిజన తండాల్లో జొన్నలు అధికంగా ఆహారంగా తీసుకున్న మనుషులు, కోళ్లలో కేన్సర్‌ లక్షణాలు అధికంగా కనిపించినట్లు ఎన్‌ఐఎన్‌ పరిశోధనల్లో తేలింది.  
నిజామాబాద్‌ ప్రాంతంలో పండించే మొక్కజొన్నలను అధికంగా కోళ్లఫారాలకు సరఫరా చేయగా, అవి తిన్న కోళ్లల్లో మరిగుజ్జుతనం, గుడ్లు పెట్టకపోవడం వంటి లక్షణాలు కనిపించాయని, ఈ కోళ్ల మాంసాన్ని ఎక్కువగా తిన్నవారిలో కేన్సర్‌ లక్షణాలు కనిపించాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
గోధుమ పిండికి బూజు పడితే అందులో ఏర్పడే  ‘డైయాక్సినివోలిన్‌’ అనే విషపదార్థం మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు సైంటిస్టులు. బూజు పట్టిన గోధుమ పిండితో తయారు చేసిన వంటకాలు తిని 1989లో కశ్మీర్‌లో 50 వేల మంది డయేరియా బారిన పడ్డారని, వారు దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

ఏయే ఆహార పదార్థాల్లో బూజు అధికంగా ఏర్పడుతుంది.. దాన్ని ఎలా గుర్తించాలి.. ఏయే ప్రాంతాల్లో దీని ప్రభావం
అధికంగా ఉందనే విషయాలపై అధ్యయనం చేసి తదుపరి చర్యల కోసం రూపొందించే ప్రణాళికలపై తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌)లో మూడు రోజుల అంతర్జాతీయ వర్క్‌షాప్‌ బుధవారం ప్రారంభమైంది. ఇప్పటికే యూకేలోని అబర్డీన్‌ వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్న ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ప్రాజెక్టు చేపట్టి పరిశోధనలు చేయనున్నారు. అందులో భాగంగా∙ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు.

అందరి భాగస్వామ్యం అవసరం
ఆహార పదార్థాల్లోని బూజు వల్ల కలిగే ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై మేధావులు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులు, సామాన్య ప్రజల సలహాలు, సూచనలు అవసరం. ఈ బృహత్తర కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయాలనే సంకల్పంతో ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాం.– డాక్టర్‌ ఎస్‌.వాసంతి, ఎన్‌ఐఎన్‌ సైంటిస్ట్‌

ఆహార అలవాట్లపై అధ్యయనం
ముఖ్యంగా మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, గోధుమల్లో బూజుతో విషపదార్థాలు ఏర్పడి అవి తిన్న వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే, ఈ తరహా ఆహారం అధికంగా తినే ప్రాంతాల వారిని ఎంపికచేసి వారిపై అధ్యయనం చేస్తాం. వారిలోని ఆరోగ్య సమస్యల ఆధారంగా నివారణ చర్యలు చేపట్టవచ్చు. అందుకు యూకే శాస్త్రవేత్తలతో కలిసి అధ్యయనం చేస్తున్నాం.  – డాక్టర్‌ రమేష్‌ వి. భట్, సీనియర్‌ సైంటిస్ట్‌  

పరిష్కారం చూపుతాం..
ఆహార పదార్థాల్లో ఏర్పడిన బూజు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నాం. అందుకు ఎన్‌ఐఎన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇందులో సంయుక్తంగా ప్రాజెక్టు చేపట్టి సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపిస్తాం.    – డాక్టర్‌ సిల్వియా గ్రాట్జ్, యూకే సైంటిస్ట్‌  

మరిన్ని వార్తలు