బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌ తిరిగి ప్రారంభం

4 Jan, 2020 08:11 IST|Sakshi

బయోడైవర్సిటీపై మళ్లీ రాకపోకలు

గచ్చిబౌలి: గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై  42 రోజులు తరువాత వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఫ్లైఓవర్‌పై నుంచి వాహనాల రాకపోకలను జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించారు. అంతకు ముందు ఫ్లై ఓవర్‌ను సీపీ సజ్జనార్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు  పరిశీలించారు. అనంతరం ఫ్లై ఓవర్‌పై నుంచి రాకపోకలను అనుమతించారు.

కాగా గత నవంబర్‌ 23న ఫ్లై ఓవర్‌పై కారు ప్రమాదం జరిగి సత్యవేణి అనే మహిళ మృతి చెందగా..మరో నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. అదే రోజు జీహెచ్‌ఎంసీ అధికారులు ఫ్లై ఓవర్‌ను మూసివేశారు. రూ.69.47 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి గత నవంబర్‌ 4న ప్రాంభించారు. వారం రోజులు తిరగక ముందే నవంబర్‌ 10న అర్ధరాత్రి ఫ్లైఓవర్‌పై సెల్ఫీ దిగుతుండగా  ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ప్రవీణ్‌ (22), సాయి వంశీ రాజు(22) ఫ్లై ఓవర్‌పై నుంచి కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు దిద్దుబాటులో భాగంగా భద్రతా చర్యలు చేపట్టారు. నవంబర్‌ 23న శనివారం ప్రమాదం జరిగిన రోజు మూసివేసిన ఫ్లైఓవర్‌పై మళ్లీ శనివారమే రాకపోకలు ప్రారంభం కానుండటం గమనార్హం.

రంబుల్‌ స్ట్రిప్స్, స్పీడ్‌ బ్రేకర్‌  
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై 1200కు పైగా రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేశారు. ఒక చోట రబ్బరు స్పీడ్‌ బ్రేకర్‌ వేశారు. 12 చోట్ల స్పీడ్‌ బ్రేకర్లుగా రంబుల్‌ స్ట్రిప్స్‌ వేశారు. ఫ్లై ఓవర్‌ పొడవునా నాలుగు వరుసలుగా తెల్లరంగు, ఎరుపు రంగు క్యాట్‌ ఐస్‌ను బిగించారు. ఫ్లైఓవర్‌ మధ్యలో ఎడమ వైపు సైడ్‌ వాల్‌పై రీలింగ్‌ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు తెలియజేసే సైన్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక మెటీరియల్‌తో ఫ్లైఓవర్‌పై స్పీడ్‌ లిమిట్‌ 40 కిలో మీటర్లు అని తెలిసేలా రంబుల్‌ స్ట్రిప్స్‌ వేశారు. 

మరిన్ని వార్తలు