అక్రమాలకు ‘గ్యాసో’హం

29 Mar, 2018 07:12 IST|Sakshi
గ్యాస్‌ సిలిండర్లు(ఫైల్‌)

సబ్సిడీ సిలిండర్ల దందాపై నిఘా అంతంతే

తనిఖీలు మృగ్యం..

పేదలపై తీవ్ర ప్రభావం

కొన్ని గ్యాస్‌ ఏజెన్సీల నుంచి ఆగని అక్రమం 

వైరా : పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే ‘డొమెస్టిక్‌’ సిలిండర్లను యథేచ్ఛగా కొందరు వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. దీనిని ఓ దందాగా మార్చేసి దండుకుంటున్నారు. పేదల సిలిండర్ల మార్పిడి తంతును నిర్వహిస్తున్నారు. కొన్ని గ్యాస్‌ ఏజెన్సీల్లో ఒక్కో సిలిండర్‌పై అదనంగా వసూలు చేస్తూ.. సబ్సిడీ గ్యాస్‌ను పక్కదారి పట్టిస్తూ అక్రమ దందా సాగిస్తున్నాయి. దమ్ముంటే కాసుకోండి.. పట్టుకోండి అన్నట్లు అధికారులకు సవాల్‌ విసురుతున్నట్లుగా మారుతోంది ఈ గ్యాస్‌ దందా పరిస్థితి. జిల్లాలో ‘డొమెస్టిక్‌’ గ్యాస్‌ సిలిండర్ల దందా ‘కమర్షియల్‌’గా సాగుతోంది.

ఈ వ్యాపారం ప్రధానంగా మండల కేంద్రాల్లో జోరుగా నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్‌ సెంటర్లలో ఇంటి సిలిండర్లను దొంగచాటున వినియోగిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతోపాటు కొందరు ఏజెన్సీదారులకు తెరచాటున ఇదొక వ్యాపారంగా మారింది. అధికంగా సిలిండర్లు వినియోగించే ప్రధాన పట్టణాల్లో తనిఖీల ఊసే లేదు. అయితే హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, ఇతర వ్యాపారాలకు కమర్షియల్‌ సిలిండర్లను మాత్రమే వినియోగించాలని ప్రభుత్వ నిబంధనలులున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో పాటించట్లేదు. 19 కిలోలు గల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,460. అదే గృహావసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ 14.6 కిలోలు ఉండి.. దాని విలువ రూ.750 నుంచి రూ.800 వరకు ఉంటుంది.

ఈ లెక్కన కమర్షియల్‌ సిలిండర్‌కు వెచ్చించే డబ్బులతో రెండు డొమెస్టిక్‌ సిలిండర్లు కొనుగోలు చేయొచ్చు. పైగా గ్యాస్‌ కూడా ఎక్కువ వస్తుంది. దీంతో అనేక హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల నిర్వాహకులు డొమెస్టిక్‌ గ్యాస్‌ను వినియోగించడానికి మచ్చిక చేసుకుని డొమెస్టిక్‌ సిలిండర్లను సబ్సిడీ లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇటు గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులకు కూడా ఒక్కో సిలిండర్‌పై రూ.200 వరకు అదనంగా వసూలు చేస్తూ.. దందాను జోరుగా నడిపిస్తున్నారు.  

తనిఖీలు కరువు.. 
జిల్లాలో డొమెస్టిక్‌ గ్యాస్‌ సింగిల్‌ కనెక్షన్‌ 2.80 లక్షలు, డబుల్‌ కనెక్షన్‌ 1.75 లక్షలు, దీపం కనెక్షన్లు 1.10 లక్షలు, సీఎస్‌ఆర్‌ కనెక్షన్లు 1.75 లక్షలు ఉన్నాయి. సిలిండర్లను సరఫరా చేయడానికి ఇండియన్, హెచ్‌పీ, భారత్‌ గ్యాస్‌ కంపెనీలు కలిపి గ్యాస్‌ ఏజెన్సీలు 350 ఉన్నాయి. కమర్షియల్‌ సిలిండర్లు మాత్రం 3వేల వరకు మాత్రమే ఉన్నాయి. పట్టణాల్లో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్‌ సెంటర్లు ఇతర వ్యాపారాలు వేలల్లో ఉన్నాయి. గ్యాస్‌ సిలిండర్ల వినియోగం అధికం. హోటల్‌ను బట్టి కొన్నింటికి వారంలో ఒకటి నుంచి రెండు సిలిండర్లు పడతాయి. మరికొన్నింట్లో నెలకు ఐదు వరకు వినియోగిస్తున్నారు. ఒక కమర్షియల్‌ సిలిండర్‌పై వెళ్లదీయడం సాధ్యం కాని పని. గ్యాస్‌ వినియోగం ఎక్కువగా ఉండడంతో కమర్షియల్‌ సిలిండర్లు కాకుండా కాకుండా డొమెస్టిస్‌ సిలిండర్లను దొంగచాటున వినియోగి స్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీడీలు కూడా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్‌ సెంటర్లపై పూర్తిస్థాయిలో తనిఖీలు చేయట్లేదని, సబ్సిడీ గ్యాస్‌ను పక్కదారి పట్టిస్తున్న కొన్ని గ్యాస్‌ ఏజెన్సీల బాధ్యులపై చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సమాచారమిస్తే సీజ్‌ చేస్తాం.. 
నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లను హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్‌ సెంటర్లలో వినియోగించడం నేరం. పట్టణాల్లో నిబంధనలను మరిచి వ్యాపారాలకు వినియోగిస్తే మాకు సమాచారం అందించండి. మేం వెంటనే సీజ్‌ చేస్తాం. వ్యాపారస్తులు కమర్షియల్‌ సిలిండర్లే వాడాలి.  
– కోటా రవికుమార్, తహసీల్దార్, వైరా 

మరిన్ని వార్తలు