త్వరలో గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తా 

29 Oct, 2019 02:46 IST|Sakshi
దీపావళి సందర్భంగా ఓ చిన్నారితో గవర్నర్‌ తమిళిసై 

సోమాజిగూడ: మరో 25 రోజుల్లో గిరిజన నివాసుల ప్రాంతాల్లో పర్యటించి వారి జీవన విధానంపై అధ్యయనం చేస్తానని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెల్లడించారు. దీపావళి సందర్భంగా ఆదివారం రాజ్‌భవన్‌లో ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. రాజ్‌భవన్‌లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించామని తెలిపారు. రాజ్‌భవన్‌కు వచ్చే వారు ప్లాస్టిక్‌ పూలు, బొకేలు తీసుకురావద్దని సూచించారు. ప్రధాని మోదీ ఇచ్చిన ‘ఫిట్‌ ఇండియా’పిలుపు మేరకు నెలరోజుల పాటు రాజ్‌భవన్‌లో యోగా కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం తనకు సొంతిల్లు లాంటిదని.. ఇక్కడి ప్రజలు గవర్నర్‌ అక్కా అని పిలవడంతో తాను పులకరించానని తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై స్పందించాలని కోరగా సమ్మె విషయం ప్రభుత్వం పరిశీలిస్తోందని, దీనిపై ఇరు వర్గాల నుంచి తనకు వినతిపత్రాలు అందాయని పేర్కొన్నారు. గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు, సభ్యుడు డాక్టర్‌ వకుళాభరణం కృష్ణ మోహన్‌ తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు