‘గ్రేటర్’ దౌర్జన్యం

8 Jun, 2014 03:15 IST|Sakshi
  • ఫైన్ కట్టడం లేదని అపార్ట్‌మెంట్ ముందు మట్టి పోసిన వైనం
  •   మట్టి తీసేంత వరకు ఫైన్ కట్టేది లేదన్న అపార్ట్‌మెంట్ వాసులు
  •   చివరకు తప్పైందని క్షమాపణ చెప్పిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది
  • గోల్నాక, న్యూస్‌లైన్: అపార్ట్‌మెంట్ దగ్గర ఉన్న మట్టికుప్పలు తొలగించనందున రూ. పదివేలు ఫైన్ కట్టాలంటూ జీహెచ్‌ఎంసీ సర్కిల్-9 ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది దౌర్జన్యానికి దిగింది. రెడ్‌బిల్డింగ్ చౌరస్తాలో శనివారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలివీ...  రెడ్‌బిల్డింగ్ చౌరస్తాలో వైష్ణవి ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌ను కొద్ది రోజుల క్రితమే నిర్మించారు. ఈ అపార్ట్‌మెంట్ దగ్గర గోడను ఆనుకొని మట్టికుప్పలు ఉన్నాయి. వీటిని తొలగించాలని జీహెచ్‌ఎంసీ సర్కిల్-9 అధికారులు ఆ అపార్ట్‌మెంట్ వాసులకు తెలిపారు.

    వారు తొలగించే లోపలే ఇటీవల కురిసిన వర్షం, గాలి దుమారానికి ఆ పరిసర ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. జీహెచ్‌ఎంసీ పారిశుధ్య సిబ్బంది ఆ కొమ్మలను తీసుకువచ్చి అపార్ట్‌మెంట్ ముందు మట్టికుప్పలపై వేశారు. వేసిన కొమ్మలను తొలగించలేదు. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు ఆ మట్టికుప్పలను తొలగించలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటన చేసిన జీహెచ్‌ఎంసీ డీఎంసీ తదితర అధికారులు మట్టికుప్పలు తొలగించని వారికి ఫైన్ రాయండని చెప్పారు.

    శనివారం రెడ్‌బిల్డింగ్ చౌరస్తాకు వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ వెహికల్ (నెంబర్ ఏపీ 11డ బ్ల్యూ 3683) సిబ్బంది అక్కడకు వచ్చి మట్టి కుప్పలను తొలగించనందుకు పదివేల జరిమానా కట్టాలని దౌర్జన్యం చేశారు. చెట్టు కొమ్మలు ఉన్నందున ఆ మట్టిని తాము తొలగించలేమని, చెట్టు కొమ్మలు తొలగించే బాధ్యత జీహెచ్‌ఎంసీదేనని అపార్ట్‌మెంట్ వాసులు వారితో పేర్కొన్నారు. దీనికి ప్రతిగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్కడ ఉన్న మట్టిని తీసుకువచ్చి అపార్ట్‌మెంట్ దారికి అడ్డంగా పోశారు.

    దీంతో అపార్ట్‌మెంట్ వాసులకు కోపం వచ్చి ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. జరిమానా వసూలు చేసే పద్ధతి ఇదేనా? అంటూ మండిపడ్డారు. ఇంతలోనే కొందరు స్థానిక నాయకులు అక్కడకు చేరుకొని అటు అపార్ట్‌మెంట్ వాసులు, ఇటు జీహెచ్‌ఎంసీ సిబ్బందితో మాట్లాడి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది తమది తప్పని, క్షమించాలని కోరారు.
     

>
మరిన్ని వార్తలు