నేటి బాలలే..రేపటి బాధితులు | Sakshi
Sakshi News home page

నేటి బాలలే..రేపటి బాధితులు

Published Sun, Jun 8 2014 3:11 AM

Today's children for tomorrow's victims ..

  •  చిన్నారులపై బ్యాగుల బండ
  •   అధిక బరువుతో వెన్ను సమస్యలు
  •   జాగ్రత్తలే మేలంటున్న వైద్యులు
  • ఖైరతాబాద్,న్యూస్‌లైన్: నేటి బాలలే రేపటి పౌరులు అన్నది అందరికీ తెలుసు.. కానీ నేటి బాలలే రేపటి బాధితులన్నది ఇప్పటి సత్యం. పట్టుమని ఐదేళ్లు కూడా నిండకముందే చిన్నారులు బస్తాల్లాంటి బ్యాగులను మోసుకెళ్తుండడంతో చిన్నప్పటినుంచే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

     చిన్న వయస్సులోనే వారి శరీర బరువులో సగానికి పైగా బరువును పుస్తకాల రూపంలో మోయాల్సి వస్తోంది. దీంతో ఎదిగే పిల్లల్లో వెన్నుపై భారంతో 14 ఏళ్లు వచ్చేసరికి అనేకరకాల సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాధారణంగా విద్యార్థి బరువులో 15శాతానికి మించి బ్యాగ్ బరువు ఉండకూడదు. వెన్నుపూస నిర్మాణం, అధిక బరువు మోయడం వల్ల వచ్చే ఇబ్బందులను గ్లోబల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చంద్రభూషణ్ తెలిపిన ప్రకారం..
     
     అధిక భారంతో కలిగే ఇబ్బందులు..

     చాలామంది పిల్లల్లో 15 సంవత్సరాల లోపే వారి శరీరంలో వివిధరకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
     
     ఇలా మార్పులను ఎప్పటికప్పుడు గమనించి వెంటనే డాక్టర్ సలహా మేరకు చికిత్స అందించాలి.
     
     పాఠశాల వయస్సులో మోయాల్సిన భారం కన్నా ఎక్కువ బరువు మోయడం వల్ల పార్శ్వగూని, స్కోలియోసిస్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
     
     పార్శ్వగూని సాధారణంగా 10 నుంచి 16 ఏళ్ల మధ్య వస్తుంది. బాలికలకు 10-14, బాలురకు 12-16 ఏళ్ల మధ్య రావొచ్చు.  
     
     వెన్ను ఒకవైపుకు వంగిపోవడాన్ని స్కోలి యోసిస్ అంటారు. ఇలాంటి ఇబ్బందులను మొదటిదశలోనే గుర్తించి తగిన చికిత్స చేయించాలి.
     
     తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

     పిల్లలకు బ్యాగులు కొనేముందు పెద్దసైజు స్పోర్ట్స్ బ్యాగుల్లాంటివి కాకుండా పుస్తకాలకు సరిపోయేలా కొనుగోలు చేయాలి.
     
     బాలుడు/బాలిక బరువు 20కిలోలు ఉంటే..వారి బ్యాగ్ బరువు 3కిలోలకు మించకూడదు.
     
     ఒకవేళ ఎక్కువ పుస్తకాలుంటే టీచర్ సలహా మేరకు ఆరోజు కావాల్సిన పుస్తకాలను మాత్రమే బ్యాగులో తీసుకెళ్లాలి.
     
     బ్యాగ్‌ను రెండు భుజాలకు వేసుకోవాలి. ఒక భుజానికి వేసుకోవడం మంచిదికాదు.
     
     బ్యాగ్‌లో పుస్తకాల అమరిక చాలా ముఖ్యం. లావటి పుస్తకాలు వీపుకు ఆనుకునేలా.. ఆ తర్వాత లావు తక్కువున్న పుస్తకాలను అమర్చాలి.
     
     బ్యాగ్‌ను నడుంకింద వరకు వేలాడేలా ఉండకూడదు.
     
     వీటితోపాటు విద్యార్థులకు నిత్యం వ్యాయామం ఉండేలా చూడాలి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.
     

Advertisement
Advertisement