బీడీ పరిశ్రమకు జీఎస్టీ పొగ

9 Jun, 2017 02:33 IST|Sakshi
బీడీ పరిశ్రమకు జీఎస్టీ పొగ

ప్రస్తుతం వెయ్యి బీడీలకు రూ.16 ఎక్సైజ్‌ డ్యూటీ
ఇక అమ్మకంపై 28 శాతం వడ్డింపు..
బీడీ కార్మికులపై ప్రభావం


కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి అమలు చేయనున్న జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) బీడీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే బీడీ కట్టపై గొంతు క్యాన్సర్‌ గుర్తు వంటి ఆంక్షలతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ పరిశ్రమపై ఈ పన్ను కోలుకోలేని దెబ్బతీయనుంది.     – సాక్షి, నిజామాబాద్‌

తగ్గనున్న పనిదినాలు...
రెక్కాడితే గానీ డొక్కాడని బీడీ కార్మికులకు ప్రస్తుతం నెలలో పది నుంచి 15 రోజులకు మించి పనిదినాలు లభించడం లేదు. కనీస వేతనాలకు సంబంధించిన జీవోనెం.41 ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. జీఎస్టీతో బీడీల ధరలను పెంచడం అనివార్యం కానుంది. తద్వారా బీడీ డిమాండ్‌ తగ్గి.. ఉత్పత్తి తగ్గించాల్సి వస్తుంది. దీంతో తమ పనిదినాలు తగ్గుతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి
లక్షలాది మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వాల ఆంక్షలతో ఈ పరిశ్రమ ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. జీఎస్టీతో కార్మికుల ఉపాధిపై దెబ్బపడుతుంది. ఇప్పటికే నెలలో 15 రోజులు కూడా పని దొరకడం లేదు. ఇకపై కార్మికుల పనిదినాలు మరింత తగ్గే అవకాశాలున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.     
– వనమాల కృష్ణ, తెలంగాణ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు

కార్మికులు ఎక్కువగా ఉండే జిల్లాలు: నిజామాబాద్,
నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల,
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట

తక్కువగా ఉండే జిల్లాలు: వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ

ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్న బీడీల సంఖ్య: సుమారు
20 కోట్లు

మన రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్న రాష్ట్రాలు: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్‌

8,00,000
రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న బీడీ కార్మికులు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీడీ కంపెనీలు:     సుమారు 150
ప్రస్తుతం సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ కింద
ప్రతి వెయ్యి బీడీలకు వసూలు చేస్తున్న మొత్తం:     రూ.16
రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం వసూలు చేస్తున్న
సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ:     రూ.75 కోట్లు
జీఎస్టీ 28 శాతం అమల్లోకి వస్తే..
రూ.100 విలువ చేసే బీడీలపై ట్యాక్స్‌:     రూ.28

మరిన్ని వార్తలు