ఉన్న అసెంబ్లీని కాదని కొత్త భవనం ఎందుకు?

24 Jul, 2019 17:48 IST|Sakshi

ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌ : పురాతన ఎర్రమంజిల్‌ భవన్‌ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని కాదని కొత్త భవనం ఎందుకని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేత పిటిషన్‌పై విచారణ సందర్భంగా .. ఇప్పుడున్న అసెంబ్లీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా?. ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకున్నారా?, అనుమతి ఉందా లేదా అన్న విషయం చెప్పడానికి ఇంత ఆలస్యం ఎందుకంటూ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. వాస్తవ పరిస్థితి ఏంటన్న దానిపై రేపటిలోగా వివరాలు ఇవ్వాలంటూ తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

కాగా ఎర్రమంజిల్‌ భవనాన్ని కూల్చి అక్కడ అసెంబ్లీ సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎర్రమంజిల్‌ భవనాల్ని 1870లో నవాబ్‌ సఫ్దర్‌జంగ్‌ ముషీర్దౌలా ఫక్రుల్‌ ముల్క్‌ నిర్మించారని, ఆ భవనం, అక్కడి స్థలం అంశాలపై సివిల్‌ వివాదం ఉండగా ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చి అసెంబ్లీ భవనాన్ని నిర్మించడం చెల్లదంటూ నవాబు వారసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు