ఎన్నికలా.. ప్రత్యేకాధికారులా?

13 Jun, 2019 04:47 IST|Sakshi

మున్సిపోల్స్‌పై వారంలోగా వైఖరి తెలియజేయండి

సర్కార్‌ను ఆదేశించిన హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: గడువులోగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారా? లేక ప్రత్యేకాధికారులను నియమిస్తారా? అనే విషయంపై వారంలోగా సమా ధానమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. విచారణ ను వారం రోజులకు వాయిదా వేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు జూలై 2తో ముగుస్తుందని, వాటికి వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ప్రక్రియ చేపట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాల్ని మంగళవారం హైకోర్టు విచారించింది.  

సమయం కావాలి..
ప్రభుత్వ వైఖరిని తెలిపేందుకు సమయం కావాలని కోర్టును అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్ర రావు కోరారు. ప్రభుత్వ వైఖరిని తెలుసుకోవాల్సి ఉందని, వారం గడువిస్తే కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలిపారు. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, ఉన్న మున్సిపాలిటీల్లో సమీపంలోని గ్రామాల విలీనం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని, ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల ఓటర్ల జాబితాల తయారీకి సమయం పడుతుందన్నారు. వారం రోజుల గడువు ఇస్తే మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగిసిన వెంటనే ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించే అవకాశం ఉందని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి చెప్పారు. వాద నలు విన్న న్యాయమూర్తి.. వార్డు విభజన, రిజర్వేషన్ల ఖరారు, ప్రత్యేకాధికారుల నియామకం, గడువులోగా (జూలై 2లోగా) ఎన్నికలు నిర్వహిస్తారా? వంటి అంశాలపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల వంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని కోరుతూ మార్చి 14, మే 4 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేకపోవడంతో ఎస్‌ఈసీ గతంలోనే వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. అవసరమైన చోట్ల వార్డు ల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై 2 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ వేసిన కేసులో హైకోర్టు గతంలో ఆదేశించింది.

మరిన్ని వార్తలు