పోలీస్ బాస్

4 Nov, 2017 07:54 IST|Sakshi
ప్రయోగశాలలో రోబో తయారీ బృందం

శరవేగంగా పోలీస్‌ రోబోల తయారీ   

డిసెంబర్‌ వరకు పూర్తి  

2018 మేలో నగర పోలీస్‌ బృందంలోకి..  

అతి తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్న హెచ్‌–బోట్స్‌ సంస్థ  

‘ఇనుములో ఒక హృదయం మొలిచెనే...’ అందరికీ సుపరిచితమైన ‘రోబో’ సినిమాలోని పాట ఇది. కానీ ఇక ‘ఇనుములో ఒక పోలీస్‌ మొలిచెనే...’ అని పాడుకోవాల్సిందే! అవును మరి.. త్వరలోనే నగర భద్రత విభాగంలో రోబో చేరనుంది. గ్రేటర్‌లో పోలీస్‌ రోబోల ప్రాజెక్ట్‌ శరవేగంగా జరుగుతోంది. టీ–హబ్‌ వేదికగా అంకురించిన ఈ ఆలోచన... త్వరలోనే అమల్లోకి రానుంది.

టీ–హబ్‌లో 6 నెలల క్రితం ఈ రోబో ఆలోచన మొగ్గ తొడిగింది. ప్రస్తుతం గచ్చిబౌలిలోని హెచ్‌–బోట్స్‌ సంస్థ ప్రయోగశాలలో రోబో నిర్మాణ పనులు వడివడిగా జరుగుతున్నాయి. ప్రభుత్వం శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న తరుణంలో.. తక్కువ ఖర్చుతో ఈ రోబోను సృష్టించేందుకు ఈ సంస్థకు చెందిన 20 మంది నిపుణుల బృందం ఎంతో శ్రమిస్తోంది. ఇనుము, కార్బన్‌ ఫైబర్‌ ముడి సరుకుగా వీటిని తయారు చేస్తున్నారు. డిసెంబర్‌ నెలాఖరులోగా ఈ రోబోల తయారీ పూర్తి కానుంది. ఆ తర్వాత నాలుగు నెలలు బహిరంగ ప్రదేశాల్లో దీని పనితీరును శాస్త్రీయంగా పరీక్షిస్తారు. వచ్చే ఏడాది మే నెలలో నగర పోలీసు బృందంలోకి ఈ రోబోను చేర్చే దిశగా పనులు జరుగుతున్నాయి. పోలీస్‌ శాఖ అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందిస్తున్నారు.

ఇదేం చేస్తుంది?  
కృత్రిమ మేధస్సుతో ఈ రోబో పని చేస్తుంది.
పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది.
ప్రజలతో సంప్రదింపులు జరుపుతుంది. వారి ఫిర్యాదు స్టేటస్‌ ఏ స్థాయిలో ఉందో చిన్న క్లిక్‌తో తెలుపుతుంది.
మిస్సింగ్‌ వస్తువులను వెతికేందుకు సాయపడుతుంది.
పేలుడు పదార్థాలను గుర్తిస్తుంది.
పోలీస్‌ శాఖను డిజిటలైజేషన్‌ చేసేందుకు దోహదం చేస్తుంది.
తప్పుడు ఫిర్యాదులు, అపరిచిత వ్యక్తుల మిస్డ్‌కాల్స్‌ను చిటికెలో గుర్తిస్తుంది.  
 
సృష్టికర్తలు వీరే...   
హెచ్‌–బోట్స్‌ సంస్థ సీఈఓ పీఎస్‌వీ కిషన్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులు. రోబోటిక్స్‌ తయారీ, పరిశోధన అంశాల్లో ప్రత్యేక కోర్సులు అభ్యసించారు. ఈ రంగంలో తొమ్మిదేళ్ల అనుభవం ఉంది. ఈ రోబో తయారీ బృందంలో హర్ష, అభిషేక్, అన్వేష్, రామ్, టోన్సీ, శశి, వినోద్, ముత్యాలరావు తదితరులు ఉన్నారు. వీరిలో కొందరు డిజైన్, మరికొందరు సాంకేతిక అంశాల్లో సేవలందిస్తున్నారు.

ఫుల్‌ డిమాండ్‌..   
ఈ పోలీస్‌ రోబోకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ఇప్పటికే గ్రేటర్‌ పోలీసులతో పాటు కర్నాటక పోలీస్‌ విభాగం, షార్జా పోలీసులు దీని పనితీరుపై ఆరా తీసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. భవిష్యత్‌లో మాల్స్‌లోనూ వీటిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 20 రోబోటిక్‌ ఉత్పత్తులను తమ సంస్థ తయారు చేసిందన్నారు.  

లక్ష్యం.. రోబోటిక్‌ హబ్‌  
2020 నాటికి దేశవ్యాప్తంగా రోబోల తయారీకి 70 ప్రయోగశాలలు ఏర్పాటు చేసి.. వ్యవసాయం, హెల్త్‌కేర్, శాంతి భద్రతల విభాగంలో సేవలందించే రోబోలను పెద్ద ఎత్తున తయారు చేయాలనేదే మా సంకల్పం. దేశా>న్ని రోబోటిక్స్‌ హబ్‌గా మార్చాలన్నదే మా లక్ష్యం.   – పీఎస్‌వీ కిషన్, హెచ్‌–బోట్స్‌ రోబోటిక్స్‌ సంస్థ సీఈఓ  

ధర రూ.3.5 లక్షలు – రూ.5 లక్షలు
అతి తక్కువ ఖర్చుతో రోబోలను తయారు చేయడం, కృత్రిమ మేధస్సుతో అవి సమర్థవంతంగా పనిచేసేలా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని పోలీస్‌ రోబో సృష్టికర్త, హెచ్‌–బోట్స్‌ సంస్థ సీఈఓ కిషన్‌ ‘సాక్షి’కి తెలిపారు. దీని బరువు 40 కిలోలు కాగా, ఖరీదు రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుందన్నారు. ప్రోటోటైప్‌ రోబోను ఇనుముతో తయారు చేస్తామని, ఇక పోలీస్‌ రోబోను మాత్రం ఇనుము, కార్బన్‌ఫైబర్‌ మెటీరియల్‌తో రూపొందిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు