తప్పు చేస్తే ప్రశ్నిస్తాం: కోదండరాం

4 Jun, 2015 22:52 IST|Sakshi
తప్పు చేస్తే ప్రశ్నిస్తాం: కోదండరాం

గోదావరిఖని(కరీంనగర్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏసీగా ఏర్పడి ఉద్యమించిన తరహాలోనే ప్రభుత్వ పాలనలో ఏదైనా తప్పు జరిగితే కచ్చితంగా ప్రశ్నిస్తామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. గురువారం రాత్రి కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల అభినందన సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, ఎన్నికల సమయంలో పాలకులు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలని, లేకుంటే మరో ఉద్యమానికి జేఏసీ సిద్ధంగా ఉంటుందని తేల్చి చెప్పారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో విజయాన్ని ఆస్వాదించినట్లే పరిపాలనలో ఏవైనా తప్పులు దొర్లితే పాలకులను అడగవలసిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రజలతో కలిసి నడిచేందుకు జేఏసీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, జేఏసీ నాయకులు పిట్టల రవీందర్, గురిజాల రవీందర్‌రావు, కెంగెర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు