నేటినుంచి బార్ షాపుల రెన్యూవల్

30 Jun, 2014 04:03 IST|Sakshi
నేటినుంచి బార్ షాపుల రెన్యూవల్

 కొత్త వాటికి లభించని అనుమతి
 
 వరంగల్ క్రైం :
  ఈ సారి కొత్త బార్ షాపులకు అనుమతి లభించలేదు. దీంతో ఇప్పటివరకు నడుస్తున్న దుకాణాలకే రెన్యూవల్ చేయనున్నారు. సోమవారం ఆ ప్రక్రియను చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 90 బార్ షాపులు ఉండగా, రెన్యూవల్ ద్వారా రూ.34కోట్ల 16లక్షల ఆదాయం సమకూరునుంది. ఇప్పటికే వైన్ షాపుల టెండర్ల ప్రక్రియ ముగియగా, బార్ షాపులతో కలుపుకుని జిల్లాలో మొత్తంగా మద్యం విక్రయ కేంద్రాలు 322కు చేరుకున్నాయి. వాస్తవానికి 234 వైన్ షాపులకు దరఖాస్తులు కోరగా, 227 కే టెండర్లు వచ్చాయి. వీటిలో 25 షాపులకు ఒక్కో దరఖాస్తే వచ్చింది. 202 షాపులకు పోటీ ఉండగా, వాటిని లాటరీ ద్వారా కేటాయించారు.
 
 టెండర్లు పడని ఏడు దుకాణాల్లో రెండింటిని మహబూబ్‌నగర్ జిల్లాకు కేటాయించగా, ఐదు షాపులకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదిలా ఉండగా,  2014-15 సంవత్సరానికిగాను బార్ షాపుల రెన్యూవల్స్  సోమవారం నుంచి చేపట్టనున్నారు. వాస్తవానికి దీనికి తుది గడువు లేనప్పటికీ జూలై ఒకటో తేదీలోపే బార్ షాపుల యజమానులు రెన్యూవల్ చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. రెన్యూవల్ సమయంలో లెసైన్స్ ఫీజులో  1/3 వంతుగానీ, సగం గానీ చెల్లించాల్సి ఉంటుంది. మిగతా సొమ్ముకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలోని 90 బార్‌లలో కార్పొరేషన్ (వరంగల్, హన్మకొండ, కాజీపేట) పరిధిలోనే 88 షాపులు ఉన్నాయి.
 
 మిగతా రెండు జనగామలో ఉండడం గమనార్హం. అక్కడి జనాభా ప్రాతిపదికన ఒక్కో బార్‌కు రూ.35 లక్షలు లెసైన్స్ ఫీజుగా నిర్ధారించారు. మహబూబాబాద్ పరిధిలో బార్‌లు లేవు. అయితే ఇప్పటికే జనాభాకు మించి బార్‌లు ఉండడంతో కొత్త వాటికి అనుమతి లేనట్లు సమాచారం. అయితే, ఈదఫా కొత్త పాలసీలో ఆరు రెట్ల ప్రివిలేజిని ఐదు రెట్లకు కుదించారు. దీంతో వ్యాపారుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. ఇప్పటివరకు రూ.2 కోట్ల 28 లక్షల విలువ చేసే సరుకు అమ్మితే 18శాతం నుంచి 20 శాతం మేర లాభం ఉండేది. తాజా నిర్ణయంతో  రూ.1కోటి 90 లక్షల మద్యం మాత్రమే అమ్మడానికి వీలుంటుంది. అంతకు మించితే 14.5 శాతం మేర ఫీజును అదనంగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
 
 కొరవడిన నిఘా.. ధరల్లో దగా..
లెసైన్స్.. దాని ఫీజు ఎలా ఉన్నా.. బార్ షాపుల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు ఉన్న కొంత వెసులుబాటును ఆసరాగా చేసుకుని ధరలను ఇష్టారీతిగా పెంచుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే,  బార్‌లలో ధరలపై తాము చేసేదేమీ ఉండదని ఎక్సైజ్‌అధికారులు చెబుతున్నారు. తమకు  ధరలను నియంత్రించే అధికారం  లేదని ఎక్సైజ్ శాఖ తేల్చివేయడంతో బార్ షాపుల యజమానులు విచ్చలవిడిగా ధరలు వసూలు చేస్తున్నారు. ఇక నకలీ మద్యం కూడా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.   

>
మరిన్ని వార్తలు