ప్రలోభాల గాలం | Sakshi
Sakshi News home page

ప్రలోభాల గాలం

Published Mon, Jun 30 2014 3:34 AM

ప్రలోభాల గాలం - Sakshi

  • జోరందుకున్న క్యాంపు రాజకీయాలు   
  •  వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల కోసం టీడీపీ ఎర  
  •  21 మండలాల్లో వైఎస్సార్‌సీపీ, 36 చోట్ల టీడీపీకి ఆధిక్యం  
  •  తక్కువ స్థానాలున్నచోట టీడీపీ అడ్డదారులు
  • ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవించాలి. ప్రజలు ఏ పార్టీకి అధికారమిస్తే వారే కొనసాగాలి. తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారమే లక్ష్యంగా బరితెగిస్తోంది. తమకు మెజారిటీ లేని మండలాల్లోనూ పాలకవర్గాలను ఏర్పాటు చేసేందుకు నైతిక విలువలకు తిలోదకాలిచ్చింది. వేరే పార్టీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తోంది.
     
    సాక్షి, చిత్తూరు: నాలుగైదు రోజుల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్‌తోపాటు చిత్తూరు కార్పొరేషన్, తక్కిన పురపాలికలకు పాలకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. ప్రజలు జిల్లా పరి షత్, చిత్తూరు కార్పొరేషన్‌తోపాటు మండల పరిషత్‌లలో మెజారిటీ స్థానాలను టీడీపీకే కట్టబెట్టారు. 65 మండల పరిషత్‌లలో వైఎస్సార్‌సీపీకి 21, టీడీపీకి 36 చోట్ల స్పష్టమైన మెజారిటీ లభించింది. తక్కిన స్థానా ల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులపై ఆధారపడి పాలకవర్గాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి.
     
    అధికారమే లక్ష్యంగా ప్రలోభాలు

    మండల పరిషత్‌లలో మెజారిటీ లేని స్థానాల్లోనూ పాలకవర్గాలను ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.  వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందిన అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. సామ, దాన, దండోపాయాలను ప్రదర్శించి దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చిన స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులను లాగేసి టీడీపీ తరఫున పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నయానో, భయానో లొంగదీసుకున్న అభ్యర్థులతో క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. మైసూరు, ఊటి, చెన్నైలాంటి నగరాల్లో క్యాంపులు కడుతున్నారు.

    మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితోపాటు టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ వ్యవహారం నడుస్తోంది. పార్టీ అభ్యర్థులను కాపాడుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు కూడా క్యాంపులకు వెళుతున్నారు. వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్న మండలాల నుంచి టీడీపీకి వలసలు ఉన్నాయని తప్పుడు ప్రచారం సాగిస్తూ టీడీపీ మైండ్‌గేమ్ ఆడుతోంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ 7, టీడీపీ 5 స్థానాలు దక్కించుకున్నాయి.

    ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలి. అయితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేసి తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బీకొత్తకోటలో 9 వైఎస్సార్‌సీపీ, 8 టీడీపీ దక్కించుకున్నాయి. ఇక్కడ కూడా టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది. పూతలపట్టు నియోజకవర్గం ఐరాలలోని 14 స్థానాల్లో రెండు పార్టీలు ఏడేసి స్థానాలు దక్కించుకున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు కీలకం కానున్నాయి. వీటితో పనిలేకుండా ఇక్కడ కూడా టీడీపీ ప్రలోభాల దూకుడు ప్రదర్శిస్తోంది.
     
    మున్సిపాలిటీలు చెరి సగం

    జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పుంగనూరు, పలమనేరు, మదనపల్లెలో వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు మున్సిపాలిటీలను టీడీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. మదనపల్లెలో టీడీపీ కుటిల రాజకీయాలకు తెరలేపింది. ఇక్కడ 35 వార్డుల్లో 17 వైఎస్సార్‌సీపీ, 16 టీడీపీకి దక్కాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టీడీపీ ప్రలోభాలకు గురి చేస్తోంది.

    ఈ నేపథ్యంలో తమ అభ్యర్థులతో టీడీపీ నేతలు నెలరోజులుగా మైసూర్‌లో క్యాంపు నడిపారు. శనివారం అభ్యర్థులంతా మదనపల్లెకు చేరుకున్నారు. తిరిగి సోమవారం వారిని అజ్ఞాతంలోకి తరలించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరి స్థానాన్ని కూడా ఇరుపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 27 వార్డుల్లో 11 వైఎస్సార్‌సీపీ, 13 టీడీపీ దక్కించుకున్నాయి. ముగ్గురు ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. వారు ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement