అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్

18 Sep, 2015 19:01 IST|Sakshi

ఖమ్మం (అశ్వారావుపేట) : ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాలలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని, అతనికి సహకరిస్తున్న ఓ మహిళను అశ్వారావుపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అశ్వారావుపేట ఎస్‌ఐ కొండ్రా శ్రీనివాస్ తెలిపిన కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పాత నేరస్తుడు కందుకూరి సోమాచారి గతంలో దొంగతనం చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అతనికి అశ్వారావుపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామానికి చెందిన సంకా రామలక్ష్మి సత్తుపల్లి సబ్‌జైలులో పరిచయం అయింది. కాగా సోమాచారి బెయిల్‌పై జూలై నెలలో విడుదలయ్యాడు.

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రామలక్ష్మి ఇంట్లో ఉంటూ అశ్వారావుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగతనాలకు యత్నించసాగాడు. ఈక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆగస్టు నెలలో చోరీకి పాల్పడి అక్కడ నుంచి తొమ్మిదిన్నర కాసుల బంగారు ఆభరణాలు, 2 సెల్‌ఫోన్లు, ఒక ఎల్‌సీడీ టీవీ అపహరించాడు. వీటన్నింటిని దాచి ఉంచి శుక్రవారం టీవీని విక్రయించేందుకు అశ్వారావుపేటలో సంచరిస్తుండగా అనుమానం వచ్చి విచారించగా గతంలో తాను చేసిన దొంగతనాలను వెల్లడించాడు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు