మద్యం మత్తులో వీరంగం.. అంతలోనే విషాదం

10 May, 2020 18:11 IST|Sakshi

సాక్షి, జగిత్యాల : మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన వీరంగం చివరికి అతని ప్రాణాల మీదకు తెచ్చింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ యువకుడు పుటుగా మద్యం తాగి మత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. రోడ్డుపై జనం చూస్తుండగానే కరెంట్‌షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన ఓ యువకుడు ఆదివారం కావడంతో పూటుగా మద్యం సేవించాడు. అనంతరం సోగుకుంటూ వస్తూ రోడ్డుపై వెళ్లే వారి మీద రాళ్లు  రువ్వాడు. పెద్దగా కేకలు పెడుతూ.. కాసేపు వీరంగం సృష్టించాడు. తమపై ఎక్కడ దాడి చేస్తాడనే భయంతో చుట్ట​పక్కనున్న ఎవరూ అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. కరెంట్‌ షాక్‌ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ యువకుడు వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు